లాభాల స్వీకరణతో మార్కెట్ల భారీ పతనం

by Harish |
లాభాల స్వీకరణతో మార్కెట్ల భారీ పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. గత వారాంతం అధిక నష్టాలతో ముగిసిన తర్వాత సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైనప్పటికీ, మిడ్ సెషన్ ముందు నుంచి భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామాలతో బడ్జెట్ తర్వాత సాధించిన లాభాలన్నీ కోల్పోయిన సెన్సెక్స్ ఇండెక్స్ తిరిగి 50 వేల మార్కు దిగువకు పతనమైంది. నిఫ్టీ కూడా 14,700 కిందకు జారిపోయింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో ఊగిసలాట ధోరణికి తోడు కీలకమైన ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో పతనం నమోదైనట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,145.44 పాయింట్లు పతనమై 49,744 వద్ద ముగియగా, నిఫ్టీ 306.05 పాయింట్లు నష్టపోయి 14,675 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా అధికంగా 3 శాతానికిపైగా పతనమవ్వగా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఆటో సూచీలు డీలాపడ్డాయి. మెటల్ రంగం మాత్రమే సానుకూలంగా కదలాడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా, డా రెడ్డీస్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్అండ్‌టీ, రిలయన్స్, మారుతీ సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed