‘కొండా’ కాన్సెప్ట్ ఇదే.. వరంగల్‌లో క్లారిటీ ఇచ్చిన వర్మ

by Shyam |
Ram Gopal Varma
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: కొండామురళి జీవిత చరిత్ర ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శకుడు రాంగోపాల్ వర్మ తెర‌కెక్కిస్తున్న ‘కొండా’ చిత్రం షూటింగ్ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. కొండా ముర‌ళి స్వగ్రామ‌మైన‌ హ‌న్మకొండ‌ జిల్లా గీసుగొండ మండ‌లం వంచ‌న‌గిరిలో బొండ్రాయి వ‌ద్ద పూజ‌ల అనంత‌రం చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఈ షూటింగ్ ప్రారంభోత్సవానికి కొండా ముర‌ళి, సురేఖ‌తోపాటు ఆమె కూతురు సుస్మితా పటేల్ ఇత‌ర కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వంచ‌న‌గిరిలో చిత్ర షూటింగ్ వివ‌రాల‌ను రాంగోపాల్ వ‌ర్మ కొండా అభిమానుల‌కు వివ‌రించారు. కొండా చిత్రం ఎలా ఉండ‌బోతోంది, కొండా ముర‌ళి క్యారెక్టర్‌ గురించి స్పష్టంగా వివ‌రించారు. సినిమాలో కొండా ముర‌ళి క్యారెక్టర్ ఎలా ఉండ‌బోతోందో ఒక్క మాట‌లో చెప్పేస్తా అంటూ ప్రేమిస్తే ప్రాణామిస్తా.. అడ్డొస్తే చంపేస్తా అనే విధంగా ఉంటుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

విప్లవం, ఫ్యాక్షన్ నేప‌థ్యాల స‌మ్మిళితంగా సినిమా ఉండ‌బోతోంద‌న్న అంచ‌నాల‌కు వ‌ర్మ వ్యాఖ్యలు బ‌లం చేకూర్చినట్లైంది. కొండా సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ముర‌ళీధ‌ర్ రావు ఎప్పుడూ పేదోళ్ల ప‌క్షం నిల‌బ‌డతార‌ని అన్నారు. మమ్మల్ని ఎంతగానో అణిచివేసేందుకు కొంత‌మంది ప్రయ‌త్నాలు చేశార‌ని అన్నారు. అందులో దయాకర్ రావు ఒక్కరని అన్నారు. అప్పట్లో మమ్మల్ని చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఆహ్వానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నన్ని రోజులు ఆ పార్టీకి మేము రామ‌ని తేల్చి చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా చిత్ర షూటింగ్ కొర‌కు హ‌న్మకొండ‌కు చేరుకున్న రాంగోపాల్ వ‌ర్మకు కొండా దంప‌తులు అభిమానులు, వ‌ర్మ అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మను చూడ‌టానికి వంచ‌న‌గిరి వ‌ర‌కు దారి పొడ‌వునా వేలాది మంది యువ‌త ఆయ‌న కాన్వాయ్‌ను అనుస‌రించ‌డం గ‌మ‌నార్హం. చాలారోజుల త‌ర్వాత కొండా శిబిరంలో, అభిమానుల్లో ప‌ట్టరానంత సంతోషం క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed