- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో కేటీఆర్‌కు కొత్త చిక్కులు.. ఆ లీడర్ తీరు వల్లే ఇదంతా..!
దిశ, సిరిసిల్ల : అతను అధికార పార్టీలో సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ కీలక నేత. ఏళ్లుగా పట్టణ పార్టీ పెద్దగా ముఖ్య పదవిలో కొనసాగుతున్నాడు. 2020 జనవరిలో జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో తాను గెలిస్తే తన ఇంట్లో నుంచి బల్దియాలో మరొక ముఖ్యమైన పదవి గ్యారంటీ అని ఊహించాడు. కానీ ఎన్నికల సమయానికి 48 గంటల ముందు తాను పోటీ చేసే వార్డులో ఓటమి ఖాయం అని తెలిసి హైరానా పడ్డాడు. చివరకు పార్టీ అధికార బలాన్ని కూడగట్టుకొని ఎలాగోలా మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అక్కున చేర్చుకున్నాడు. ఇంకేముంది రాష్ట్రంలో, స్థానిక సిరిసిల్లలో తిరుగులేని రాజకీయ పార్టీలో ముఖ్య నేతగా ఉంటూనే, సిరిసిల్ల బల్దియా కీలక పదవిని సాధించుకున్నాడు. ఇక రెండు పదవులు తన చేతిలో ఉండటంతో ప్రస్తుతం అన్ని తానై బల్దియాపై పెత్తనం చలాయిస్తూ పార్టీలో ‘చక్రం’ తిప్పుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది.
అసమ్మతి సెగలు..
మంత్రి కేటీఆర్ ఇలాకాలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయా..! అంటే అవునని చెప్పక తప్పని పరిస్థితి. సిరిసిల్ల పట్టణ గులాబీ పార్టీలో పైకి అందరూ ఐకమత్యంగా, సంతృప్తిగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం అసమ్మతి రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. బల్దియాపై ఆధిపత్యం చలాయిస్తున్న సదరు నేత తీరే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణ పార్టీలో, బల్దియాలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తుంది. తనకు అనుకూలంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లు, విలీన గ్రామాల నాయకులను, ప్రతిపక్ష నాయకుల కంటే మరీ చిన్నచూపు చూస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు తమకు ఎలాంటి పదవులు దక్కడం లేదని అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతీసారి ఏదో ఒక సాకుతో కాలం వెళ్లబుచ్చుతూ కౌన్సిలర్లు, పార్టీలోని నేతలను మభ్యపెడుతూ వస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా కొందరు కౌన్సిలర్లు ఇన్ డైరెక్ట్‌గా తమ అసమ్మతిని తెలియజేయాలని సిరిసిల్ల అధికార పార్టీ వాట్సాప్ గ్రూప్ నుండి వైదొలిగారు. దీంతో కంగుతిన్న సదరు నేత అసలేం జరిగిందని ఆరా తీసి క్యాంపు ఆఫీసులో బుజ్జగింపు చర్యలకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. పరిస్థితి ఇలానే కొనసాగితే ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ వీడక తప్పదని సంకేతాలను పంపిస్తున్నారు.
నిధుల కేటాయింపులోనూ పక్షపాతం..
బల్దియా కీలక పదవిని దక్కించుకునేందుకు పార్టీ ఆదేశాలను గౌరవించి సదరు నేతకు సహకరించిన యువ కౌన్సిలర్లు, నాయకులు ప్రస్తుతం నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తమ వార్డులను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరిన వారికి నిరాశే ఎదురవుతోందని వాపోతున్నారు. ఆయనకు అనుకూలంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్లకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని గోడు వెల్లబోసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు సైతం ఆయన వర్గం నాయకులకే సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.విలీన గ్రామాలపై కూడా సదరు నేత నిర్లక్ష్యం వహిస్తున్నాడని కొందరు నాయకులు వాపోతున్నారు.గ్రామాలను విలీనం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ అభివృద్ధి మాటలను నమ్మామని.. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని విలీన గ్రామాల కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులను మంజూరు చేశారు. మొదటి దఫాగా రూ.15కోట్ల నిధులను విడుదల చేసారు. కాగా అందులో విలీన గ్రామాలకు కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి చేయాలని సదరు నేతకు సూచించారు. కానీ ఆయన మాత్రం మంత్రి మాటను బేఖాతరు చేస్తూ కేవలం రూ.50 లక్షలను మాత్రమే కేటాయించినట్లు సమాచారం.
అభివృద్ధి కోసం ప్రజలను ఒప్పించి విలీనానికి సిద్ధపడిన తమ కాలనీలకు కనీసం మోడల్ వార్డు అవకాశం రాలేదని, దీనితో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు స్థానిక నేతలు పేర్కొంటున్నారు. పట్టణంలో కీలక నేతగా ఉండి అదే కుటుంబం నుండి బల్దియాకు మరో కీలక పదవి ఉండటమే ఇష్టారాజ్య వ్యవహారశైలికి కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు అధికార పార్టీలోని పెద్దలకు తెలిపిన సదరు నేత తీరులో మాత్రం ఏ మార్పు రాలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహార శైలిని మార్చుకోకుంటే పార్టీ మారే యోచనలో అసమ్మతి నేతలు ఉన్నట్లు సిరిసిల్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు సిరిసిల్లలో కారు స్పీడును తగ్గించేందుకు కమలదళం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో సదరు గులాబీ నేత ఏకపక్ష నిర్ణయాలతో కేటీఆర్ సొంత ఇలాకాలో పార్టీ నుండి వలసలు జోరందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై గులాబీ చిన్న బాస్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో వేచి చూడాల్సిందే.