సర్పంచ్ మృతి… ఉప సర్పంచ్ ఇంటిపై దాడి

by Shyam |   ( Updated:2020-09-03 06:02:55.0  )
సర్పంచ్ మృతి… ఉప సర్పంచ్ ఇంటిపై దాడి
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ మాసు రాజయ్య నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం సర్పంచ్ మృతికి పంచాయితీ కార్యదర్శి తిరుమల, ఉప సర్పంచ్ పూర్ణచందర్ రావులే కారణమంటూ మండల కేంద్రంలో దళిత సంఘాలు, బంధువులు, సంబంధిత పార్టీ నాయకులు పరకాల చిట్యాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఉపసర్పంచ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగా, ఇంటిపై రాళ్లు విసిరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, ఆందోళన కారులను చెదరగొట్టారు.

ఉపసర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

జూలై 23 నుంచి సర్పంచ్ రాజయ్య అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై మానవతా ధృక్పంతో సాయపడాల్సిన ఉపసర్పంచ్, ఆ పని చేయకుండా సర్పంచ్ అనారోగ్యంతో పంచాయితీ కార్యాలయానికి రావడం లేదని బిల్లులు పెండింగ్‌లో ఉండి అభివృద్ధి ఆగిపోయిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ గత నెల 28న ఉపసర్పంచ్ పూర్ణ చందర్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజయ్య మరింత ఆందోళనకు గురయ్యారు.

అంతేగాకుండా తీవ్ర మనస్థాపానికి గురై గతరాత్రి చనిపోయారని బంధువులు, దళిత సంఘాల నేతలు ఆరోపించారు. సర్పంచ్ మృతికి పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ వ్యవహరించిన తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ దళితుడు కావడం వల్లే ఉపసర్పంచ్, కలెక్టర్ ఆయనపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తిపై మానవత్వం లేకుండా వ్యవహరించి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. ఉపసర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story