- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మలూ.. షాపింగులూ!
ఆషాడం, శ్రావణం మాసాల్లో చీరల మీద తక్కువ ధరలు అంటూ రోడ్లపై పెద్ద పెద్ద హోర్డింగులు కనపడేవి. టీవీల్లో ఆఫర్ల ప్రకటనలు, ప్రోమోలు హోరెత్తేవి. దసరా, దీపావళి, వినాయక చవితి ఆఫర్లు, లక్కీడ్రాలు అంటూ నానా హంగామా ఉండేది. ఇప్పుడు ఆ అదృష్టం లేదు. వెళ్లేవాళ్లు బయటకు వెళ్తున్నా.. ఇంట్లో అమ్మకు మాత్రం చెప్పలేనంత భయం. అది పైకి చాదస్తంలాగే కనిపించినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావాల్సింది అలాంటి చాదస్తమే. అయితే ఈ కారణాల వల్ల అమ్మల ఆషాఢం షాపింగ్‌కు బ్రేక్ పడింది అనుకోవడం తప్పే అవుతుంది. నిజానికి ఇంకాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎలాగో అర్థం కావటం లేదా? అయితే చదవండి!
లేటెస్ట్ శారీస్ ఆన్‌లైన్ అని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కాకుండా ఒకసారి యూట్యూబ్‌లో కొట్టిచూడండి. అమ్మల షాపింగ్ ఎందుకు పెరిగిందో మీకే తెలుస్తుంది. అవును.. ఆర్‌ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాదు గానీ, హైదరాబాద్, విజయవాడల్లో పేరు పొందిన ద్వితీయ శ్రేణి బట్టల షాపులన్నీ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకున్నాయి. లాక్‌డౌన్ సమయం నుంచి మూతపడి ఉండటం, లాభాల విషయం పక్కన పెడితే కనీసం వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు. అందుకే వారు కూడా అందరిలాగే డిజిటల్ బాట పట్టారు. ప్రత్యేకంగా యాప్ గానీ, వెబ్‌సైట్ గానీ పెట్టుకునేంత బడ్జెట్ లేదు కాబట్టి యూట్యూబ్‌ను, వాట్సాప్‌ను వారధిగా చేసుకుని వ్యాపారం నడిపేస్తున్నారు. తమ దగ్గర ఉన్న స్టాక్ గురించి, చీరల గురించి, వాటి ధరలు, ఇతర వివరాలతో పాటు కనీసం ఎంత షాపింగ్ చేయాలి? ఎలా కొనాలి? అనే వివరాలను కూడా యూట్యూబ్ వీడియోలో పెట్టేస్తున్నారు.
ఇక ఈ వీడియోలను చూడటానికి ఇంట్లో అమ్మలు, ఆంటీలు సిద్ధంగా ఉంటున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేసి చీరలు ఎలా చూడాలో చెప్తే చాలు. ఇక ప్రతి డిజైన్‌ను, ప్రతి అల్లికను తీక్షణంగా చూస్తున్నారు. వారికి నచ్చిన చీరను స్క్రీన్‌షాట్ తీసుకుని, దాన్ని ఆర్డర్ చేయమని భర్త వెంట, కొడుకుల వెంట పడుతున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా బిజినెస్ అవుతుండటమే కాకుండా వారి వీడియోలకు వీక్షణలు వచ్చి ప్రకటనల రెవిన్యూ కూడా వస్తుండటంతో బట్టల షాపుల యజమానులు కూడా తక్కువ ధరకే చీరలను అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మహిళల ఆన్‌లైన్ షాపింగ్‌లో విప్లవాత్మక మార్పు వచ్చింది. కామెంట్స్‌లో చీర బేరం చేస్తున్న మహిళలు కూడా ఉన్నారంటేనే ఆ బిజినెస్ ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి యాప్స్‌లో చీరను విప్పి, దాని తోకలు ఈకలు చూసే అవకాశం ఉండదు. కానీ ఈ యూట్యూబ్ వీడియోల్లో ఒక చీర గురించి దుకాణాదారు వివరంగా చెప్పడంతో మహిళలకు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఈ యూట్యూబ్ చీరల బిజినెస్‌ను ఒక రీసెల్లింగ్ బిజినెస్‌గా కూడా మార్చుకున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా ఇలా ఏ దుకాణానికి ఆ దుకాణం కాకుండా వివిధ దుకాణాల్లోని చీరలను యూట్యూబ్ వీడియోల్లో పెట్టి డబ్బు వెనకేసుకోవడానికి కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఒక ఫిమేల్ యాంకర్‌ను పంపించి, బట్టల దుకాణాల్లో ఉన్న చీరలను చూపిస్తూ, ట్రయల్ వేస్తూ వీడియోలు తీసి ఈ డిజిటల్ మీడియా సంస్థలు యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాయి. కరోనా కూడా కట్టుకునే చీరను, వాటిని కొనే మహిళను అడ్డుకోలేదని మరోసారి నిరూపితమైంది!