విద్యుత్ శాఖలో సజ్జనార్ మార్క్ తప్పదా..?

by Anukaran |   ( Updated:2021-11-24 11:44:11.0  )
Electricity bills
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్​శాఖలో బకాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం సంస్థపై తీవ్రంగా పడుతోంది. దీంతో డిస్కంలు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొవిడ్ సంక్షోభంతో కేవలం గ్రేటర్​పరిధిలోనే దాదాపు రూ.230 కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కరోనాకు ముందు ఈ పెండింగ్​బిల్లులు కాస్త తక్కువగానే ఉన్నా.. మహమ్మారి కారణంగా ఎందరో ఆర్థిక నష్టాలను చవిచూశారు. దీంతో పెండింగ్​బిల్లులు భారీగా పేరుకుపోయాయి.

బిల్లులను రికవరీ చేయాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఇంత మొత్తంలో పెండింగ్​ఉన్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కేవలం పనులు పూర్తి చేయకుండా.. పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడం వరకే పరిమితమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని సంస్థలోని పలువురు అధికారులు, సిబ్బంది వెల్లడించడం గమనార్హం.

విద్యుత్​శాఖలో పలువురు అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు తప్పా రికవరీలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ పెండింగ్​బిల్లుల వసూళ్లకు అధికారులు ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వల్ల కొంత మొత్తం వసూలైనప్పటికీ ఇంకా సంస్థకు రావాల్సినవి పెద్ద మొత్తంలోనే ఉన్నాయి. బిల్లులు వసూలు చేసే సిబ్బందికి వినియోగదారులు చెల్లించినా సిబ్బంది చేతివాటం చూపించి వారి సొంత ఖర్చులకు వినియోగించుకోవడంతో బిల్లులు మరింత పెండింగ్‌లో పడుతున్నట్లు సమాచారం. దీనికితోడు విద్యుత్ సిబ్బంది, అధికారులు.. వినియోగదారులకు ఎలాంటి బిల్లుల చెల్లింపులపై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో చెల్లింపులో జాప్యం జరుగుతోంది.

నిర్ణీత గడువులోపు డొమెస్టిక్​ వినియోగదారులు బిల్లులు చెల్లించకుంటే రూ.25 అదనంగా ఆలస్యపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సర్​చార్జీలు అదనం. అలాగే నిర్ణీత గడువులోపు కమర్షియల్​బిల్లులు చెల్లించకుంటే రూ.150 అదనంగా ఆలస్యపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు ప్రతినెల 20 నుంచి 30 తేదీల్లో మాత్రమే.. అది కూడా డబ్బులు రెగ్యులర్​గా చెల్లించే వారినుంచే బిల్లులు వసూలు చేసి పెండింగ్​లో ఉన్న వినియోగదారులను అడగడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

కొవిడ్ పేరుతో గ్రేటర్ జోన్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల వసూళ్లకు డిస్కం ప్రణాళికలు చేసుకుంది. అందుకు అనుగుణంగా ఎస్ఈలతో పాటు డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులకు టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది. అయినా హైదరాబాద్ దక్షిణ సర్కిల్​పరిధిలో రూ.90 కోట్లకకుపైగా, సెంట్రల్ సర్కిల్లో పరిధిలో రూ.29 కోట్లకుపైగా, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రూ.50 కోట్లకుపైగా రికవరీ కావాల్సి ఉండటం గమనార్హం. గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో ప్రతినెల రూ.850-900 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వసూలవుతాయని శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా రూ.20 నుంచి 30 కోట్ల వరకు బకాయిలు సాధారణంగా ఉండేవి.

అయితే కొవిడ్​ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి జీవితాలు రోడ్డున పడటంతో చాలా మంది బిల్లులు చెల్లించలేకపోయారు. దీంతో ఈ బకాయిలు ఏకంగా రూ.200 కోట్లను మించిపోయాయి. కాగా ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కొందరు వినియోగదారులు విద్యుత్​శాఖ అధికారులకు వినతులు సైతం సమర్పిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు 2014లో 30 శాతం జీతాలు పెంచగా.. 2018లో 35 శాతంగా చేశారు. ఈ పెంచిన జీతాలు విద్యుత్​సంస్థకు భారంగా మారడం, సంస్థ నష్టాల్లో ఉండటం, దానికితోడు విద్యుత్​బకాయిలు రికవరీ కాకపోవడం వంటి అంశాలు యాజమాన్యానికి తలనొప్పిగా మారాయి.

ఆర్టీసీ సంస్థలో ఎండీ సజ్జనార్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేసి అవగాహన కల్పించినట్లే విద్యుత్​ వినియోగదారులకు సైతం అవగాహన కల్పిస్తే బాగుండేదని చెబుతున్నారు. ఆ దిశగా విద్యుత్ అధికారులు ముందడుగు వేస్తేనే గ్రేటర్‌లో పెరుకుపోయిన బకాయి బిల్లులు వసూలు అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ ఉద్యోగులే పేర్కొనడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed