అందుకోసమే ‘అసెంబ్లీ రద్దు’.. RS ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు

by Anukaran |
RS-praveen-knr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూమి లేని నిరుపేద రైతు కూలీలుగా ఉన్న దళితులు ట్రాక్టర్ల ఓనర్లు కాబోతున్నారు, 75 ఏళ్ల నుండి మాకు ఇవి ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదన్నమాట.. ఇప్పుడు ట్రాక్టర్ల ఓనర్లమవుతున్నామని అనడానికి కారణం హుజురాబాద్ ఎన్నికల కోసమేనని బీఎస్సీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్‌లో బీఎస్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తొండి చేసైనా మొండి చేసైనా మీరు గెలవాలకుంటున్నారని అందుకోసమే మాపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఏడేళ్ల పాలనలో ఎస్సీ కార్పోరేషన్‌కు కేటాయించిన నిధుల్లో 30 శాతం మాత్రమే రిలీజ్ చేశారని ఆరోపించారు. లక్షల మందికి సాయం చేస్తామని చెప్పి లక్ష మందికి కూడా సాయం చేయలేదన్నారు. 3 ఎకరాల భూమి అని 10 వేల మందికి ఇచ్చి తరతరాలకు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని గుంజుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండి పడ్డారు. ఒక్క హుజురాబాద్‌లో మాత్రమే ఎందుకు వచ్చాయి ..అక్కడ గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఏం నష్టం ఉంటుందో ఆలోచించాలని కోరారు.

తాను మాట్లాడితే వణికిపోతున్నారని, కరంటు తీసేస్తున్నారన్నారు. మేము అధికారంలోకి వస్తే మీ ఫామ్ హౌస్‌కు కూడా కరంటు కట్ చేస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీల కండువాలు చెత్త బుట్టలో పడేసి పార్టీలో చేరడానికి వస్తున్న అందరికీ స్వాగతం చెప్తున్నామన్నారు. గౌరవ మంత్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్న మల్లారెడ్డిని మీ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ బూతులు నేర్పిస్తారా..? అని అడిగారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు మల్లారెడ్డిని బహిష్కరించేందుకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు ‘‘బీఎస్పీ హవా నడుస్తుందని.. రేపు అసెంబ్లీని రద్దు చేసినా.. ఆశ్చర్యపోనక్కర’’ లేదన్నారు. ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఫెయిల్ అయ్యిందని, రాత్రికి రాత్రి తీసిన జీవోలు అవినీతి గురించి బయటికి వస్తుందనే హుజురాబాద్ డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బాగా నటిస్తున్నాయన్నారు. ఇక్కడ జరిగిన అవినీతి బీజేపీకి తెలియదా..? మీ చేతిలోనే ఈడీ ఉంది కదా విచారణ జరిపించొచ్చు కదా.. అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వచ్చిన పోస్టులు ఖరారు చేయడానికి మూడు ఏళ్ళు పడుతోందా అని అడిగారు. మొన్న ఉద్యోగం రాలేదని ఒక యువకుడు జమ్మికుంటలో ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాణం చాలా విలువైనది ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రవీణ్ కుమార్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల బడా కాంట్రాక్టర్లకు న్యాయం జరిగింది తప్పా.. బహుజనులకు న్యాయం ఏ మాత్రం జరగలేదన్నారు.

బహుజనుల రాజ్యం ఉంటే కాళేశ్వరం కాకుండా జ్ఞానేశ్వరం కట్టించే వాళ్ళమని వ్యాఖ్యానించారు. నల్లగొండలో అంత పెద్ద సభ పెడితే ‘ప్రభుత్వ మీడియాకు’ కనపడలేదు మరి అలాంటప్పుడు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం తో ప్రకటనలు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. బహుజనుల ప్రభుత్వం వస్తే ప్రగతిభవన్ బహుజన భవన్‌గా మారుస్తామని ఆర్ఎస్పీ ప్రకటించారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లోకి పోయిందో మీరే ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అవతలి టీమ్ దగ్గర డబ్బులు బాగున్నాయి వాళ్ళు మభ్యపెట్టి ఓట్లు రాయించుకొనే యత్నం చేస్తుంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో బహుజన ప్రభుత్వం రావడం అంతా సునాయాసం కాదన్న విషయం గుర్తు పెట్టుకుని కష్టపడి పనిచేయాలన్నారు. ‘కారు కింద పడతారా.. ఏనుగు ఎక్కిపోతారా..?’ ఆలోచించుకోవాలని ప్రవీణ్ కుమార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed