ఈ సాలా కప్ నమ్‌దే.. ఆర్సీబీ కల నెరవేరేనా..?

by Anukaran |   ( Updated:2021-04-19 07:28:26.0  )
ఈ సాలా కప్ నమ్‌దే.. ఆర్సీబీ కల నెరవేరేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సాలా కప్ నమ్ దే(ఈ సారి కప్ మాదే).. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ చెప్పే మాట. కానీ.. ఆ మాట ఇప్పటివరకు నెరవేరలేదు. టీమిండియాకు ఎన్నో మ్యాచుల్లో విజయాలను తెచ్చిపెట్టిన విరాట్ కోహ్లీ.. అతడి సారథ్యంలో బెంగళూరు జట్టు ఒక్క ఐపీఎల్ సీజన్‌లో కూడా కప్ కొట్టలేదు. 2009లో ఒక్కసారి ఫైనల్ వరకు వచ్చి.. రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు RCB కెప్టెన్‌గా ఉన్నది అనిల్ కుంబ్లే. అయితే, 2021లో మాత్రం ఐపీఎల్ కప్ కొట్టే జట్ల లిస్ట్‌లో RCB కూడా చేరిపోయిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని.. అందుకే వరుసగా మూడు మ్యాచుల్లో జట్టు విజయం సాధించిందని.. ఈ సారి కప్ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఈ సీజన్‌లో ఏబీడీకి తోడుగా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు.

జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలకమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టేది. మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. రన్నరప్‌గా మాత్రమే నిలిచింది. గతేడాది, 2015, 2010 సీజన్‌లల్లో ప్లే ఆఫ్స్‌ వరకు రాణించింది. మిగతా సీజన్‌లు అయినా..(2008, 2012, 2013, 2014, 2017, 2018, 2019) గ్రూప్ స్టేజిలోనే ఇంటి బాటపట్టింది. ఇప్పటివరకు జరిగిన సీజన్‌లల్లో టీ-20 స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్లు, మంచి బౌలర్లు ఉన్నప్పటికీ RCB అంతగా రాణించలేకపోయింది.

2021 సీజన్‌ ఆర్సీబీకి ప్రత్యేకం..

గత ఫలితాలు ఎలా ఉన్న ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ (విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పటిదార్) విఫలమైన మిడిలార్డర్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల విజయంలో వీరిద్దరి పాత్ర కీలకం. దీనికి తోడు డెత్ ఓవర్లల్లో డాట్ బాల్స్‌తో పాటు వికెట్లు తీసుకుంటూ.. మహ్మద్ సిరాజ్, కేల్ జెమీసన్, హర్షల్ పటేల్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మాన్‌లను కట్టడి చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా ఆర్సీబీ జట్టుకు ప్లస్ పాయింట్లుగా మారాయి.

చెలరేగుతున్న మ్యాక్స్‌వెల్

గత మూడేళ్ల సీజన్‌లో అత్యంత పేల ప్రదర్శన చేసిన మ్యాక్స్‌వెల్ ఆర్సీబీలో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 2018లో ఢిల్లీ, 2020లో పంజాబ్ తరఫున ఆడిన అంతగా ఆకట్టుకోలేదు. ఢిల్లీ తరఫున 12 మ్యాచులు ఆడి.. 169 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో టాప్ స్కోర్ 47 మాత్రమే. ఇక పంజాబ్‌ తరఫున 13 మ్యాచుల్లో 11 సార్లు బ్యాటింగ్ చేసినా.. అత్యంత దారుణంగా 108 పరుగులు చేశాడు. ఇందులో టాప్‌ స్కోరు 32గా ఉంది.

ఇక 2021 ఐపీఎల్ యాక్షన్‌లో బెంగళూరు మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. ఇటువంటి సమయంలో అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా తొలి మ్యాచ్‌ ముంబైతో‌నే మ్యాక్స్‌వెల్ బ్యాక్ టు ఫామ్ అయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 28 బంతుల్లో 39 పరుగుల తీశాడు. హైదరాబాద్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 59 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌ నిలిచాడు. ఆ తర్వాత కోల్‌కతాపై 78 పరుగులు చేశాడు. మొత్తం 3 మ్యాచుల్లో 176 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 186 పరుగులతో ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ కొనసాగుతున్నాడు.

అయితే, మిడిలార్డర్‌లో ఏబీడీకి తోడుగా మ్యాక్స్‌వెల్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఛేదన ఆర్సీబీకి సులభం అవుతోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వీరికి తోడు టాప్‌ ఆర్డర్‌ కూడా క్లిక్ అయితే.. ఆర్సీబీ 2021 టైటిల్ రేసులో స్థానం పదిలంగా ఉంటుందనే చెప్పాలి. మరోవైపు బౌలింగ్‌లో కూడా ఆర్సీబీ ఏ మాత్రం తీసుపోకుండా ఉండడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో ఆర్సీబీ ప్రత్యేకమైన పోస్టులు పెడుతూ అభిమానులను ఉర్రూతలుగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed