పోస్టల్ పార్సిల్ విభాగంలో రోబోలు

by Shyam |   ( Updated:2021-10-06 09:11:17.0  )
Parcel-1
X

దిశ, ఫీచర్స్ : ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌తో పరిశ్రమల ముఖచిత్రాలు మారిపోతున్నాయి. కృత్రిమ మేధ మరో పారిశ్రామిక విప్లవం తీసుకురానుందని ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే కొన్నేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగాన్ని, ప్రపంచాన్ని ఊహించలేమంటే అతిశయోక్తి కాదనే మాటలే వినబడుతున్నాయి. ఈ కొత్త పరిజ్ఞానం ప్రతీ వ్యవస్థను సాంకేతికంగా ఉన్నతంగా మార్చనుండగా, ఉద్యోగాల మార్కెట్‌లో అనూహ్య మార్పులు తీసుకురానుంది. ఇప్పటికే రోబోల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తగా, తాజాగా పోస్టల్ వ్యవస్థలోనూ రోబోట్ల వినియోగం మొదలైంది. గ్రీస్ పోస్టల్ విభాగం ఈ దిశగా ముందడుగు వేసింది.

పాండిక్ టైమ్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే పార్సిళ్ల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని ప్యాక్ చేయడం ఉద్యోగులకు సవాల్‌గా మారింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వ యాజమాన్యంలోని పోస్టల్ కంపెనీ రోబోలను నియమించుకుంది. గ్రీస్ తపాలా సేవలో మొత్తం 50 ఫోర్ వీలర్ రోబోలు కొలువు తీరగా, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ మొబైల్ రోబోలే కావడం విశేషం. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ రోబోలు రోజుకు 15 కిలోల బరువున్న 1,68,000 పార్సిళ్లను ప్యాక్ చేయగలవు. వీటిని ప్రతీ నాలుగు గంటలకోసారి 5 నిమిషాల పాటు రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. పోస్టల్ కోడ్‌ను స్కాన్ చేయడం, ప్యాకేజీ వెయిట్ చెక్ చేయడం, ప్లాట్‌ఫామ్ చుట్టూ ఏర్పాటు చేసిన సంబంధిత మెయిల్ సంచుల్లోకి ఆయా పార్సిళ్లను ప్యాక్ చేయడం వంటి పనులు చేస్తాయి. కాగా, ఈ రోబోలను చైనాకు చెందిన జెజియాంగ్ లిబియావో రోబోట్ కో లిమిటెడ్ అభివృద్ధి చేసింది.

‘మాన్యువల్ లేబర్ చేస్తున్న సార్టింగ్‌లో తరచూ లోపాలు సంభవిస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులకు డెలివరీ ఆలస్యం కావడమే కాక, కంపెనీకి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకే 80% వరకు పార్సిల్ సార్టింగ్‌ను ఆటోమేటెడ్ రోబోలకు అప్పగించాం. సాధారణంగా రోజువారీ జరిగే పనికన్నా మూడు రెట్లు అధికంగా జరుగుతోంది. మా ఉద్దేశ్యం మానవ కార్మికులను రోబోలతో భర్తీ చేయడం కాదు, మానవ శ్రామిక శక్తిని పెంచాలనుకుంటున్నాం. వనరులను ఉపయోగించుకుంటూ ఉద్యోగుల పనిని సులభతరం చేస్తున్నాం.
– జవరాస్, హెలెనిక్ పోస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్

Advertisement

Next Story