- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాకలో… ‘హాట్’ ఫైట్..!
దుబ్బాక ఉప ఎన్నిక.. పేరుకు ఇది ఉప ఎన్నికే అయినా.. ప్రధాన పార్టీలన్నిటికీ దీని ఫలితం ఎంతో ప్రతిష్టాత్మకం.. అందుకే ఇక్కడ గెలిచేందుకు మూడు పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంటే.., అధికార పార్టీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ ఎత్తలు వేస్తోంది.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ తాపత్రయ పడుతోంది.. ఎందుకంటే ఈ విజయం మూడు పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.. కాగా, ఈ ఉప ఎన్నిక కోసం నేడు నోటిఫికేషన్ జారీ కానుండడం, నామినేషన్ల ప్రక్రియ కూడా నేటినుంచే ప్రారంభమవడంతో ‘దుబ్బాక ఫైట్.. హాట్ హాట్..’ గా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి ఇమేజ్‌ను వాడుకునేలా ఆయన కుమారుడ్ని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దృష్టి పెట్టింది. వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమంటూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ మూడు పార్టీల మధ్య పోటీలో ఓటరు ఏ అభ్యర్థిని గెలిపిస్తారో వచ్చే నెలలో తేలనుంది. ఇక్కడ వచ్చే ఫలితం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై పలు రూపాల్లో ప్రభావం చూపనున్నది. అందుకే అన్ని పార్టీలూ సీనియర్ నేతలందరికీ ఈ నియోజకవర్గ ప్రచారంలో బాధ్యతలు అప్పగించాయి. పోలింగ్ బూత్‌ల వారీగా వివిధ స్థాయిల్లోని పార్టీ ఇన్‌చార్జ్ లను నియమించాయి. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు హోరెత్తుతున్నాయి. ప్రచార కార్యకలాపాలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. అన్ని పార్టీల పెద్దలూ ఈ నియోజకవర్గంలోనే మకాం వేశారు. మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఏ నిమిషం ఏం జరుగుతుందోననే సస్పెన్స్ కొనసాగుతోంది.
సానుభూతి, సెంటిమెంట్ టీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలు..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై తక్షణం ప్రభావం ఉంటుందనేది అధికార టీఆర్ఎస్ అభిప్రాయం. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఆయన భార్యకే టికెట్ కేటాయించింది. సెంటిమెంట్ కలిసొస్తుందని స్థానిక పార్టీ కార్యకర్తల నమ్మకం. మంత్రి హరీశ్‌రావు సైతం ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్నారు. అన్ని పార్టీలకంటే ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాష్ట్ర మంత్రి అయినా నియోజకవర్గానికే పరిమితమై పూర్తి ఫోకస్ పెట్టారు. తానే అభ్యర్థిగా భావించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఏ ఫలితం వచ్చినా అది హరీశ్‌రావు ఖాతాలోనే పడుతుంది. వరుసగా రెండుసార్లు గెలిచినందున మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్నది ఆ పార్టీ వ్యూహం.
ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందన్న ఆశలో బీజేపీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో ఈ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని స్థానిక సమస్యలను, అంశాలను తీసుకుని బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఓటర్లలో యువత గణనీయమైన స్థాయిలో ఉన్నారని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బాగా కలిసొస్తుందన్న ధీమాతో ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీస్తారని కొన్ని సెక్షన్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఓట్లు రాబట్టడానికి ఉపయోగపడుతుందనుకుంటోంది. ఇదే నియోజకవర్గంలో గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన రఘునందన్‌రావుకు ఈసారి సింపతీ కలిసొస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ స్థానిక నేతల్లో ఉంది. ఆరేళ్లలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కల్పించలేకపోయిందని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిపై కూడా ఆశలు పెట్టుకుంది.
తండ్రి పలుకుబడే పునాదిగా కాంగ్రెస్..
ఈ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచి మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి పలుకుబడి, ఇమేజ్‌పైనే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిల్చున్న ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ప్రస్తావిస్తూనే తండ్రి పేరును విస్తృతంగా వాడుకుంటున్నారు. అధికార పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గా నియమితులైన మాణిక్యం స్వయంగా ఇక్కడ పర్యటించి సీనియర్ నేతలందరికీ టాస్క్ అప్పజెప్పారు. గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉండి ఇక నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ గెలుపు సాధించి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ..
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నేడు (శుక్రవారం) నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా దాంతో పాటే మొదలుకానుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు ఉంది. 19వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారనేది తేలిపోతుంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.