రిహన్నా @పీపుల్స్ వాయిస్

by Shyam |
రిహన్నా @పీపుల్స్ వాయిస్
X

దిశ, ఫీచర్స్: దేశంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి అంత‌ర్జాతీయంగా మ‌ద్దతు ల‌భిస్తున్న సంగతి తెలిసిందే. పాప్ సింగ‌ర్, బార్బడోస్‌కు చెందిన న‌టి రిహన్నా కూడా భారత్‌లో రైతుల ఉద్యమానికి మ‌ద్దతు తెలిపారు. ఈ మేరకు అంత‌ర్జాతీయ మీడియాలో రైతుల ఉద్యమానికి సంబంధించి ప్రచురిత‌మైన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన రిహన్నా.. ‘దీనిపై మ‌నం ఎందుకు స్పందించ‌కూడ‌దు’ అని ప్రశ్నించడంతో, ఆ ట్వీట్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ట్వీట్ త‌ర్వాత రైతుల ఉద్యమానికి అంత‌ర్జాతీయ సమాజం సపోర్ట్ పెరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా పలువురు సెలెబ్రిటీలు, క్రికెటర్లు ట్విటర్‌లో స్పందించడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే, ప్రపంచ సామాజిక ప్రయోజనం కోసం రిహన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచాన్ని శాంతియుతమైన ప్రదేశంగా, ఉత్తమమైన సమాజానికి వేదికగా మలచడానికి ఎన్నో ఏళ్లుగా తన వాణిని వినిపిస్తుండటం విశేషం.

అమెరికన్ పాప్ ఐకాన్‌గా పేరుపొందిన రిహన్నా పూర్తి పేరు రాబిన్ రిహన్నా ఫెంటీ. బహుముఖ ప్రజ్ఞావంతురాలైన ఈ పాప్ సింగర్.. ఇప్పటికే తొమ్మిది గ్రామీ, 13 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్, 12 బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్, 6 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2012-2014కు సంబంధించి అత్యధిక పారితోషికం పొందిన టాప్ 10 ప్రముఖుల్లో రిహన్నాకు స్థానం కల్పించింది ఫోర్బ్స్. అత్యంత ధనికురాలైన ఫిమేల్ మ్యూజిషియన్స్‌లో ఒకరిగా నిలిచిన ఆమె నికర ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్ల పైమాటే. ఇది ఆమె జీవితంలో సాధించిన విజయాలకు టీజర్ మాత్రమే. సింగర్, యాక్టర్, ఎంటర్‌ప్రెన్యూర్, డిప్లొమట్, ఫిలాంత్రపిస్ట్, రైటర్‌గానూ ఆమె సేవలు ప్రశంసించదగ్గవే. కానీ అన్నింటికంటే మించి ఆమె ఒక మానవతావాది. ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసన గురించి పోస్ట్ చేసి భారత్‌ను కదిలించింది. 1.30 బిలియన్లకు పైగా జనాభా గల దేశాన్ని ఒకే ఒక్క ట్వీట్‌తో ఆమె వైపు తిరిగేలా చేసింది. చాలామంది ఆమె ఉద్దేశ్యాన్ని ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌తో ఆనందిస్తున్నారు.

రిహన్నా ట్వీట్స్

భారతదేశంలో రైతుల నిరసన గురించి ట్వీట్ చేయడానికి ముందు, రిహన్నా మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు గురించి ట్వీట్ చేసింది. అక్కడ సాయుధ దళాలు దేశంపై నియంత్రణ సాధించడంతో ఏడాది పొడవునా అత్యవసర పరిస్థితికి దారితీసింది. దాంతో ఆమె ‘మై ప్రేయర్స్ విత్ యూ’ అంటూ ట్వీట్ చేసింది. 2017లో వైరల్ అయిన ఎండ్ సార్స్ హ్యాష్‌ట్యాగ్‌(#EndSARS )ను ఉపయోగించి రిహన్నా ట్వీట్ చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా, పౌరులను హింస పెడతున్న నైజీరియా స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్ (SARS)ను రద్దు చేయడమే దీని లక్ష్యం. రిహన్నా, ఆమె ఫౌండేషన్ ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాయి. ఆమెతో పాటు, తన బ్యూటీ బ్రాండ్లు బ్లాక్ లైవ్స్‌కు సంఘీభావంగా బ్లాక్అవుట్ మంగళవారం రోజు పనిచేయడం మానేశాయి. అంతేకాదు సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా నిలబడి పోలీసుల హింసకు గురైన నిరసనకారులకు తన మద్దతు తెలిపింది. ఇక అమెరికాలో పోలీసుల దారుణానికి, అన్యాయానికి వ్యతిరేకంగా 2016లో తొలిసారిగా జాతీయ గీతం కోసం నిలబడకూడదని శాంతియుత నిరసనను ఎంచుకున్న కోలిన్ కైపెర్నిక్‌కు మద్దతుగా నిలిచింది. ఇందులో భాగంగా 2019 సూపర్ బౌల్ హాఫ్ టైమ్ షోలో ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించింది.

బార్బడోస్‌లోని సెయింట్ మైఖేల్‌లో జన్మించిన రిహన్నా.. బాల్యంలో అనేక కష్టాలు ఎదుర్కొంది. అయినా ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపరుచుకుంటూ, కెరీర్‌లో రాణించింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించిన రిహన్నా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప మానవతావాదిగా అవతరించింది. పాండమిక్ సమయంలోనూ గ్లోబల్ కరోనా వైరస్ రిలీఫ్ కోసం ఆమె ఐదు మిలియన్ డాలర్లు విరాళంగా అందించి దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. స్థానిక ఆహార బ్యాంకులే కాక యునైటెడ్ స్టేట్స్‌లోని రిస్క్ కమ్యూనిటీలకు, వృద్ధులకు సేవలను అందించడంతో పాటు హైతీ, మాలావి వంటి దేశాల్లో కొవిడ్ పరీక్షా ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు సహకరించింది. ఆ దేశాల్లో డయాగ్నస్టిక్ ల్యాబ్స్ కోసం అవసరమైన రక్షణ పరికరాలను కూడా అందించడమే కాకుండా వైద్య నిపుణులను కూడా సమకూర్చింది. ఆమె సేవలకుగాను 2018లో తనను ‘అంబాసిడర్ ఎక్స్‌ట్రార్డినరీ అండ్ ప్లీనిపోటెన్షియరీ’ గా బార్బడోస్‌ ప్రకటించింది.

తన తోటి వయసువారు టీనేజ్ జీవితాన్ని ఆస్వాదించడంలో బిజీగా ఉన్న టైమ్‌లో.. 18 ఏళ్ల రిహన్నా ‘బిలీవ్ ఫౌండేషన్‌’ ప్రారంభించింది. ఇది క్యాన్సర్, ఎయిడ్స్, లుకేమియా వంటి టెర్మినల్ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు సాయం చేయడమే లక్ష్యంగా పనిచేసే సంస్థ. తక్కువ వనరులు, నిధుల లేమితో సతమతమయ్యే పాఠశాలలకు అవసరమైన సామగ్రిని అందించడమే కాక, ఆశ్రయాలలో నివసించే నిరాశ్రయులైన పిల్లలకు దుస్తులను విరాళంగా ఇస్తుంటుంది. అక్కడితో ఆగిపోని రిహన్నా.. 2012లో ‘క్లారా లియోనెల్ ఫౌండేషన్‌’ అనే మరో ఎన్‌జీవోను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లలకు సరైన విద్య, వైద్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఫౌండేషన్ కోసం నిధుల సేకరణకు ‘ది డైమండ్ బాల్’ అనే పేరుతో ప్రతి సంవత్సరం ‘చారిటీ గాలా’ను నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష వేలానికి హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, బిజినెస్ టైకూన్స్ హాజరవుతారు.

‘గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఎడ్యుకేషన్’ అనే ఆర్గనైజేషన్‌కు ఎంపికైన తొలి అంబాసిడర్ రిహన్నానే కాగా, ఈ సంస్థ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో గల బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రతిచోటా పిల్లలందరికీ నాణ్యమైన విద్యావకాశాలు అందాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, దీనికోసం అందరూ శ్రమించాలని 2018లో జరిగిన ‘జీపీఈ ఫైనాన్సింగ్’ సమావేశంలో రిహానే తన గొంతును వినిపించింది. ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న రిహన్నా సేవలను గుర్తించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2017‌లో ‘హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో ఆమెను సత్కరించింది.

Advertisement

Next Story

Most Viewed