'మర్డర్' నా దృష్టికోణం.. నా హక్కు : వర్మ

by Jakkula Samataha |
మర్డర్ నా దృష్టికోణం.. నా హక్కు : వర్మ
X

అమృత, ప్రణయ్, మారుతీరావుల యదార్థ గాథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్. ఆదివారం విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పై వర్మను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ నోట్ రిలీజ్ చేసింది అమృత. వర్మకు మహిళలను గౌరవించాలని నేర్పించే తల్లి లేనందుకు చింతిస్తున్నానని.. అసలు నా అనుమతి లేకుండా నా లైఫ్ స్టోరీ సినిమాగా ఎలా తీస్తారని నోట్‌లో ప్రశ్నించింది. ఇప్పుడిప్పుడే సమాజానికి దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటే.. వర్మ రూపంలో మరో సమస్య ఎదురైందని మండిపడింది.

కాగా ఈ నోట్ పై స్పందించాడు వర్మ. ‘అమృత రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన నోట్ పై స్పందించాలి అనుకుంటున్నా’ అని తెలిపిన వర్మ.. ‘అమృత, తన తండ్రి కథపై సినిమా తీస్తున్నానని తెలిసి తనకు సూసైడ్ చేసుకోవాలనిపించిందని అమృత అన్నట్టుగా తెలుస్తోంది. అది అమృత రాసిందో లేదా ఒక పని లేని వ్యక్తి రాశాడో తెలియదు కానీ.. నేను సినిమాలో ఏం చూపించబోతున్నానా అని చాలా ఆతృతగా ఉన్న ప్రతి ఒక్కరికీ దీనిపై క్లారిటీ ఇస్తా’ అన్నాడు వర్మ.

నేను ముందే చెప్పా.. ఇది నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా అని.. కానీ నిజమైన కథ అని ఎక్కడా చెప్పలేదన్నారు వర్మ. కొన్నేళ్లుగా నా చిత్రం దేని మీద ఆధారపడి తెరకెక్కుతోందనే వార్తలు వస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో దీన్ని కొందరు వ్యక్తులు అంగీకరించారని చెప్పారు వర్మ.

‘మర్డర్ ఆధారంగా ఉన్న కథను ఎన్నో కోణాల్లో చూడవచ్చు కానీ నా దృక్పథం ఏంటో సినిమా చూశాక అర్థమవుతుంది. కాబట్టి అప్పటిలోగా అపరిపక్వతతో ఏదేదో ఊహించుకోవడం మంచిది కాదని’ అన్నారు.

‘ఒక మర్డర్ గురించి చెప్పేటప్పుడు జర్నలిస్టులకు, ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులకు, అధికారులకు ఒక్కొక్కరి కోణం ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక ఫిల్మ్ మేకర్‌గా నా కోణం నాకుంది.. దాన్ని తెరకెక్కించే హక్కు నా సొంతం. ఒకరి నెగెటివ్ లైట్ గురించి సినిమాలో చూపించబోతున్నా అనుకోవడం మూర్ఖత్వం.. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డవాడు అయ్యాడంటే కారణం తన పరిస్థితులే తప్ప, తన తప్పు కాదని నమ్ముతా.. అదే సినిమాలో చూపించబోతున్నా’ అని తెలిపాడు.

ఫైనల్గా ఆ నోట్ రాసిన వ్యక్తులకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. ‘విపరీతమైన బాధను భరించిన వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంటుంది.. ఆ బాధను గౌరవించడం .. దాన్ని సందర్భోచితంగా చూపించి పునరాలోచన చేసేలా చేయడం నా ముందున్న కర్తవ్యం’ అని తెలిపారు వర్మ.

Advertisement

Next Story