మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుపోతున్న ఆర్జీవీ

by Anukaran |   ( Updated:2020-08-02 02:24:35.0  )
మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుపోతున్న ఆర్జీవీ
X

ఒక సినిమా రిలీజయ్యేలోపే.. మరో సినిమాను తెరమీదకు తీసుకొస్తుంటాడు రాంగోపాల్ వర్మ. తన చిత్రాలన్నీ కూడా ప్రకటనతోనే మొదలవుతాయి. మొన్ననే ‘పవర్ స్టార్’ పేరుతో పవన్ కల్యాణ్‌పై సినిమా తీసి విమర్శలు అందుకున్న ఆర్జీవీ.. మరోసారి అదే ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ‘అల్లు’ అనే ఫిక్ష‌న‌ల్ సినిమాను తెరకెక్కిస్తున్న‌ట్లు లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం ఆయ‌న బావమరిది ఏం చేశాడ‌నేది ఈ సినిమాలో చూపిస్తామ‌ని తెలిపారు. ‘జ‌న రాజ్యం’ పార్టీని స్థాపించ‌డంతో క‌థ మొద‌లవుతుంద‌ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇక సినిమా టైటిల్ ‘అల్లు’ అని ఎందుకు పెట్టాడన్న విషయాన్ని కూడా వర్మ వివరించారు. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారి ర‌కార‌కాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని, అందుకే దీనికి ఆ పేరు పెట్టామ‌న్నారు. ‘త‌న‌కు మంచి జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు, మ‌రొక‌డికి చెడు జ‌ర‌గాలంటే ప్లాన్ అల్లు.. అనే స్ట్రాట‌జీతో ప్లాన్లు అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన త‌న బావ ప‌క్క‌నే ఉంటూ త‌న మైలేజీ ప‌డిపోకుండా ఉండేందుకు త‌మ ఇంటి అల్లుడును కూడా మ‌ర్చిపోయి ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్లు అల్లుతూ ఉంటాడు’ అంటూ పేర్కొన్నాడు ఆర్జీవీ.

అంద‌రితో త‌న‌ను ‘ఆహా’ అనిపించుకోడానికి త‌న‌కు కావాల్సిన వాళ్ల‌కే మంచి జ‌రిగేలా చెప్పి, ప్లాన్‌ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లిక‌ల మాస్ట‌ర్ క‌థే ఈ ‘అల్లు’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని పాత్ర‌ల పేర్ల‌‌ను కూడా వెల్ల‌డించారు. ఈ సినిమాలో ఎ.అర‌వింద్‌, కె.చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎ.అర్జున్‌, ఎ.శిరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్.‌బాబు త‌దిత‌రులు ఉంటార‌ని తెలిపారు. ఇక ఈ చిత్రం మెగా ఫ్యామిలీ వారి అల్లు అర‌వింద్ గురించి తీస్తున్న‌ట్లు అందరికీ అర్థమైపోయింది. అయితే ఆ కుటుంబం అంటే ఎంతో ప్రేమ అని, త‌న‌ని నికృష్టుడు అని పిలిచిన అల్లు అర‌వింద్‌పై ప్ర‌తీకారం కాద‌ని వర్మ స్ప‌ష్టం చేశారు.

Advertisement

Next Story