‘బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి’

by Shyam |   ( Updated:2021-07-18 08:32:38.0  )
TRS Ledars
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని.. అధ్యక్షుడి హోదాలో హుందాగా వ్యవహరించాలే గాని దిగజారుడు, అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోకాపేట భూములకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆన్ లైన్ టెండర్లు పిలువడంతో పాటు పత్రిక ప్రకటనలు చేసిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీలో టెండర్లలో పాల్గొన్నాయని, అలాంటప్పుడు వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ ప్రకటనలు చేయడం హాస్యాస్పందంగా ఉందన్నారు. భూముల వేలంలో ఎలా అవినీతి జరిగిందో రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఆన్ లైన్ టెండరింగ్‌లో రేవంత్ రెడ్డి ఎకరాకు వంద కోట్లు వేస్తే ఎవరన్న వద్దన్నారా? అని ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. టెండర్ల విధానం తెలంగాణ ఒక్కటే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంభిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రియల్ భూమ్ ఢిల్లీ-ముంబై-బెంగుళూరు-కోల్ కత్తాలో కూడా లేదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 7 నుంచి రూ.14 కోట్లు మినిమమ్ ధర పెట్టిన విషయం తెలియదా? అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నీళ్లు, నిధులు వచ్చాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల పెన్నిధి అన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో భూముల అమ్మి ఆంధ్రకు ఖర్చు చేస్తారనే ఆనాడు భూ అమ్మకాలను అడ్డుకున్నామన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో ప్రపంచంలోని టాప్-10 కంపెనీలు తెలంగాణకు వచ్చాయని స్పష్టం చేశారు. మెట్రో, రింగ్ రోడ్డు వచ్చాయని, త్వరలోనే రిజినల్ రింగ్ రోడ్డు రానున్నట్లు వెల్లడించారు. జోనల్ వ్యవస్థ ఆమోదంతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయన్నారు. కరోనా కాలంలో కూడా సంక్షేమ, అభివృద్ధిని కొనసాగించిన ప్రభుత్వం తెలంగాణ అన్నారు. అసత్య ఆరోపణలతో హైదరాబాద్ బ్రాండ్ ను తగ్గించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించొద్దని సూచించారు.

టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, తెలంగాణలో రేవంత్‌ను మించిన అవినీతి పరుడు మరొకరులేరని దుయ్యబట్టారు. రాజపుష్ప సంస్థ తెలంగాణ ఏర్పాటుకు ముందే లీడింగ్ రియలేస్టేట్ సంస్థ అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ వదిలేస్తే కాంగ్రెస్ బాగుపడుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలిచే కాంగ్రెస్… రేవంత్ రెడ్డి వల్ల అవికూడా గెలవవని జోస్యం చెప్పారు. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో అనుచరులకే వేలం పేరుతో వేల ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ది పారదర్శక పాలన అన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించేందుకే భూముల అమ్మకం అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story