- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రివర్ వాటర్‌పై తెలంగాణ ప్లాన్ రివర్స్
దిశ, న్యూస్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులపై జీవో జారీచేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాల అంశంపై తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. గోదావరి జలాల వినియోగంలో ఏపీ.. తెలంగాణను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇక గోదావరి బోర్డుకు వివరాలు సమర్పించే అంశంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో ప్రభుత్వం చర్చిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ఏకంగా సీనియర్ న్యాయవాదుల బృందాన్ని నియమించింది. అసలు గోదావరి బోర్డుకు డీపీఆర్‌లు ఇవ్వకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఎలా మొదలుపెడతారని నీటి పారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. విభజన చట్టం సెక్షన్ 85 (8)- డీ ప్రకారం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించాలంటే ట్రిబ్యునల్ నీటి కేటాయింపులున్న ప్రాజెక్టుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా వాటిని డీపీఆర్‌లను ముందుగానే బోర్డుకు సమర్పించి సాంకేతిక అనుమతి తీసుకున్న తర్వాత చేపట్టాల్సి ఉంటుంది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఏపీలు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలంటూ బోర్డు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అవేమీ తీసుకోకుండానే రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయని నీటి పారుదల శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏపీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా… తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు.
తెలంగాణకు కొత్త తలనొప్పి
రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్నప్రాజెక్టులపై మొత్తం వివరాలు, వాటికి సంబంధించిన డీపీఆర్‌లు బోర్డుకు సమర్పించాలని జీఆర్ఎంబీ లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త సమస్య మొదలైంది. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరంతో పాటుగా పలు ఎత్తిపోతల పథకాలపై వివరాలడిగింది. ఈ పరిణామాలు ఊహించని విధంగా ఎదురవుతున్నాయి. వాస్తవంగా గోదావరిపై నిర్మాణం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు జీవోలపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయగానే… ఏపీ కూడా ఫిర్యాదులు చేసింది. కృష్ణా బోర్డుపై తెలంగాణ ప్రభుత్వమే ప్రాజెక్టులు నిర్మిస్తుందని, నీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. దీంతోపాటుగా గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామప్రాజెక్టు, తుపాకుల గూడెం, తెలంగాణ డ్రింకింగ్ సప్లై ప్రాజెక్టు, లోయర్‌పెన్ గంగ బరాజ్‌లు రాజ్‌పేట, చనాఖా-కొరటా, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాలకు గోదావరి నీళ్ల మళ్లింపు చేస్తున్నట్టు ఏపీ గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన బోర్డు… తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలడిగింది.
కాళేశ్వరంతోపాటుగా సీతారామ, తుపాకుల గూడెం ఎత్తిపోతలను దీనిపైనే నిర్మిస్తోంది. సీతమ్మసాగర్ బ్యారేజీ (దుమ్ముగూడెం) దిగువన దాదాపు 30 టీఎంసీలను వినియోగించుకునే విధంగా ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎదురుదాడికి దిగినట్టుగా గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా బోర్డు వివరాలడగడంతో కొంత అయోమయం నెలకొంది.
అంతు చిక్కని వివరాలు
వాస్తవంగా రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్న నీటి ప్రాజెక్టుల వివరాలు అంతు చిక్కని సమాధానంగానే మిగులుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా విపక్షాలు మొత్తుకున్నా… ఒక్క కాగితం కూడా బయటకు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం నుంచి మొదలుకుని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అడుగుతూనే ఉన్నాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం వాటిని బయటకు ఇవ్వలేదు. ఇప్పుడు గోదావరి బోర్డు వివరాలు అడగడంతో ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ డీపీఆర్‌లు, వివరాలన్నీ బోర్డుకు ఇస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని విపక్షాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల నుంచి రహస్యంగా దాచిపెట్టుతున్న గోదావరి ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడు బయటకు వస్తాయా? అనేది సందేహంగానే మారింది.
ప్రగతిభవన్‌కు ఇరిగేషన్ అధికారులు
నీటి పారుదల శాఖ అధికారులు ప్రగతి భవన్‌లోనే చర్చిస్తున్నారు. గోదావరి బోర్డు అడిగిన వివరాలను సమర్పించాల్సి వస్తే తీసుకోవాల్సిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంలు దీనిపై ఒకే నిర్ణయానికి వస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. గోదావరి, కృష్ణా బోర్డుకు వివరాలు, డీపీఆర్‌లను ఇవ్వకుండా కాలయాపనకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
దూకుడు మీదున్న ఏపీ
మరోవైపు కృష్ణా జలాల అంశంలో ఏపీ ప్రభుత్వం దూకుడు మీదుంది. ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను ప్రత్యేకంగా నియమించింది. లక్షల ఫీజులతో న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది ఉమాపతి, శ్రీనివాస్ వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. జల వివాదాలపై మొత్తంగా సీనియర్ న్యాయవాదులు వెంకటరమణి, అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి, అడ్వకేట్ ఆన్ రికార్డు జీ నాగేశ్వర్ రెడ్డిని నియమించింది.