కేబినెట్‌లోకి వెంకట్రామిరెడ్డి..?

by Sridhar Babu |   ( Updated:2021-11-17 01:12:42.0  )
Venkatramireddy1
X

దిశ, గజ్వేల్: నిన్నటిదాక సిద్దిపేట జిల్లా బాస్ గా పనిచేసి కేసీఆర్ చేత ‘ఔరా’ అనిపించుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడం అనూహ్య నిర్ణయమేమీ కాదని, దీని వెనక పక్కా ప్రణాళిక ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమవుతోంది. పది నెలల ముందే వీఆర్ఎస్ తీసుకోవడమంటే ఓ వైపు సాహసోపేత నిర్ణయంలా కనిపించినా, మరోవైపు ఎమ్మెల్సీ పదవి రూపంలో కలెక్టర్ గిరీ చేసినదానికి రెండు రెట్ల జీతంతోపాటు, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మంత్రి పదవి ఊరిస్తుండగా, సీఎంవో ఆఫీస్ నుండి అలా పిలుపు వచ్చిందే తడవుగా పదవిని తృణప్రాయంగా వదిలి, సరికొత్త రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టాడు. సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉండటంతో ఇప్పటివరకూ ఎవరికీ కేటాయించకుండా తన వద్దనే అంటిపెట్టుకుని, పాలనలో కీలకమైన రెవె’న్యూ’ పదవే వెంకట్రామిరెడ్డిని అలంకరించనుందనే లీకులు మీడియాకిచ్చారంటే, రాబోయే రోజుల్లో వెంకట్రామిరెడ్డి హవా ఎలా కొనసాగబోతుందో చెప్పకనే చెబుతుందీ ఉదంతం.

ఇదిలావుండగా అకస్మాత్తుగా అంతర్థానమై, అంతే అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే చందంగా కేసీఆర్ ఎవరి ప్రాధాన్యాన్ని ఎప్పుడు ఆకాశానికెత్తుతాడో, ఎవరి ప్రాధాన్యాన్ని ఎప్పుడు భూస్థాపితం చేస్తాడో తన నీడకు సైతం తెలియనీయడు. అయితే ఎంతో మంది ఆశావహులను, సీనియర్లను, ఉద్యమ కారులను పక్కన పెట్టి అనూహ్యంగా వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేయడంలో మతలబేంటో? సిద్దిపేట జిల్లాలో ఎవరికి అసలు ‘ట్రబుల్స్’ మొదలవనున్నాయో ఎవరికెరుక..? ఇక సీఎం కుమారుడి పట్టాభిషేకానికి ధ్వజస్తంభాల్లాంటి ఇద్దరు అడ్డంకిగా మారగా, ఒక స్తంభమైన ఈటలను పొమ్మనలేక పొగబెట్టగా ఈటల ఎపిసోడ్ ఘన విజయం దిశగా సాగుతోంది. మొత్తానికది పక్కింటోడి సంసారంలా సాగుతున్నా ఇంకో మూలవిరాట్ లాంటి మరో మూల స్తంభం మిగిలుండటం, ఆ స్తంభాన్ని కదిలించాలని చూస్తే ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్థితి ఉండటంతో ఏం మంత్రమేసి ఆ మూలవిరాట్ ను మూలకు కూర్చోబెడతాడో ఆ దేవుడికే ఎరుక! లేక వెంకట్రామిరెడ్డి ప్రాధాన్యతను నానాటికీ పెంచి సిద్దిపేట టికెట్ వెంకట్రామిరెడ్డికి ఇచ్చి, ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా షూటర్లు, గిటార్ల పని ఖతం చేయనున్నాడో తెలియదు. ఇక మీ గజ్వేల్ ఎమ్మెల్యే నేను కాదు వెంకట్రామిరెడ్డే అని ఓ నిండు సభలో ఆయన్ని స్వయంగా సీఎం చెప్పడం, ప్రస్తుత పరిణామాలన్నింటిని గమనిస్తే కేసీఆర్ 2023 ఎన్నికల నాటికి గజ్వేల్ నియోజకవర్గం నుండి తప్పుకుని ‘యాదాద్రి’ నుండి పోటీ చేయనున్నాడనే లీకుల నేపథ్యంలో గజ్వేల్ టికెట్ పొందడం వెంకట్రామిరెడ్డికి నల్లేరు మీద నడకే! కానీ, పక్కా టికెట్ తనకే దక్కుతుందని ఆశిస్తున్న ప్రస్తుత ‘అటవీ సహకార సంస్థ’ అధ్యక్షులవారి పరిస్థితి వనవాసమేనా? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పదవి దక్కించుకోవడంతోపాటు కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

టార్గెట్ ఈటల.. ఇప్పటినుంచే సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్

Advertisement

Next Story

Most Viewed