టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇస్తారా.. చస్తారా.. తేల్చుకోండి: రేవంత్ రెడ్డి

by Anukaran |   ( Updated:2021-08-09 11:01:20.0  )
revanth-and-trs
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తున్నాయని దళిత బంధు తీసుకొచ్చాను అంటూ సీఎం కేసీఆర్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంద్రవెల్లి వేదికగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాంగ్రెస్ చరిత్ర.. ఏడేళ్ల కేసీఆర్ నేరాలు ఘోరాలు చూడాలంటూ చురకలు వేశారు. ఉపఎన్నిక వస్తే హుజురాబాద్‌లో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తాను అంటున్నారని.. తాను మఠం నడపడం లేదు.. రాజకీయ పార్టీ నడుపుతున్నా అంటూ కేసీఆర్ నిస్సిగ్గుగా, భరితెగించిన మాటలు మాట్లాడుతున్నారని.. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడలేదని విమర్శించారు. అందుకే దండుగట్టి.. దళిత దండోరా పెట్టి.. 118 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడైనా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్న నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అందుకే కాంగ్రెస్ యువనేతలు, యువకులు ఏకతాటిపైకి వచ్చి.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇస్తాడా.. సస్తాడా అనేది తేల్చుకునేలా చేయాలన్నారు.

గజ్వేల్‌లో గుంట భూమి అడగలే..

‘గజ్వేల్‌లో గుంట భూమి అడగలే.. చింతమడకలో చిల్లి గవ్వ అడగలే.. నువ్వు అధికారంలోకి వచ్చిన 7 ఏండ్లలో రూ. 15 లక్షల కోట్లు ఖర్చు చేశాను అంటున్నావు.. అందులో పది పైసలైనా ఆదివాసీలకు పెట్టావా.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న అప్పులు కాకుండా.. కొత్తగా రూ. 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిండు. నాలుగు కోట్ల మంది మీద ఒక్కో లక్ష చొప్పును అప్పు మోపిండు.. మనకు మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదు గానీ.. తలమీద మాత్రం లక్ష అప్పు తీసుకొచ్చిండు. మరీ ఈ సొమ్మంతా ఎక్కడపోయింది. ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినవ్.. ఏ కమీషన్లకు పెట్టినవ్.. నీ బిడ్డనేమో బిర్లాను జేసినవ్.. అల్లుడినేమో అంబానిని జేసినవ్.. కొడుకునేమో టాటాను జేసినవ్.. నువ్వేమో నరరూప రాక్షసుడిగా తయారయ్యావు.. కుంభకర్ణుడిలా మారి ఫామ్‌ హౌస్‌లో మందుతాగుతున్నావు.. మరి మా పేదల పరిస్థితి ఏంటి’ అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పాలనలో దళితులకు న్యాయం జరగలేదు..

టీఆర్ఎస్ పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పే మాట తప్పారన్నారు. హుజురాబాద్‌లో ఉపఎన్నిక రావడంతోనే దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. హుజురాబాదులోనే కాకుండా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇస్తే హరితహారం పేరుతో కేసీఆర్ లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల పట్టాల కోసం లక్ష మందితో కలిసి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. – ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం..

పది శాతం రిజర్వేషన్లు గిరిజనులకు కల్పించడానికి పోరాటాలను కొనసాగిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అటవీ సంపదపై గిరిజనుల దే హక్కు అని తెలిపారు. ఉప ఎన్నికల దళిత బంధు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న దళితులు అందరికీ అమలు చేయాలన్నారు . కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణను కేసీఆర్ మోసం చేశాడు..

ప్రజలను ప్రభావితం చేసేలా ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీనెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని మధుయాష్కి గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి దళిత గిరిజన సభను ఏర్పాటు చేశామన్నారు. పోడు భూముల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చి పట్టాలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కుందని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామన్నారు. -మధుయాష్కి గౌడ్

కేసీఆర్‌కు మాట్లాడే అర్హత లేదు..

సీఎం కేసీఆర్‌కు దళిత గిరిజనుల పై మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు ప్రకటించడం సరికాదన్నారు. ఈ పథకం కేవలం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి దళిత కుటుంబానికి వర్తించేలా చేయాలన్నారు. దళిత గిరిజనుల హక్కుల కోసం దళిత గిరిజన దండోరాను ఏర్పాటు చేశామన్నారు. – -ములుగు ఎమ్మెల్యే సీతక్క

Advertisement

Next Story