పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ?

by Anukaran |   ( Updated:2020-11-15 12:48:44.0  )
పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో అలర్టైన కాంగ్రెస్ హైకమాండ్.. ఇక తెలంగాణకు పీసీసీ చీఫ్‌ను ప్రకటించకుంటే పార్టీకి జరిగే నష్టంపై ఓ అంచనాకు వచ్చి రేవంత్‌ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ్రూపు తగాదాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ మొత్తాన్ని నడిపించే సమర్థత, కేసీఆర్‌కు ధీటుగా సమాధానం ఇవ్వగల సామర్థ్యం, చెల్లాచెదురైన పార్టీ శ్రేణులను ఏకతాటి పైకి తెచ్చే అంశాలను కూలంకషంగా చర్చించి రేవంత్‌రెడ్డి పేరునే ఫైనల్‌‌గా చేశారని సమాచారం. దీనిపై రేపో మాపో ప్రకటన వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

అటు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా నలుగురైదుగురి పేర్లతో కూడిన జాబితాను సైతం ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారని తెలుస్తుండగా.. వీరందరిలో ప్రముఖంగా ఫైర్‌బ్రాండ్ రేవంత్‌ పేరే డిసైడ్ చేశారని టాక్. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించాలని అధిష్ఠానం భావించినా.. దుబ్బాక బై ఎలక్షన్ ప్రభావంతో ఇప్పుడే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్యం ఠాగూర్‌ ఇప్పటికే పార్టీ పరిస్థితి.. దుబ్బాక ఎన్నికల్లో నేతలు చూపిన పనితీరు, వచ్చిన రిజల్ట్, పార్టీ కేడర్ అభిప్రాయం, నేతల మధ్య గ్రూపులు, ఇలా అన్ని విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం.

అయితే.. ఇప్పటికప్పుడు కొత్త పీసీసీ చీఫ్‌ను ప్రకటించకుంటే పార్టీకి జరిగే ప్రమాదాన్ని, కింది స్థాయిలో ఉన్న కేడర్‌ను కోల్పోయే అవకాశం, బీజేపీకి రాజకీయ పరిస్థితి అనుకూలంగా మారే ఛాన్స్‌లన్నింటినీ హైకమాండ్‌కు తెలిపినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్‌ పేరును ప్రకటించి, ఎన్నికల్లో పార్టీ సత్తాను నిరూపించాలని.. లేకుంటే మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పార్టీ ఉనికే ప్రమాదంలో పడొచ్చన్న ఆందోళన ఏఐసీసీ నాయకులకు అర్థమైంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed