- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: టీపీసీసీ చీఫ్‌ని ప్రకటించిన హై కమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డిని ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామక ఉత్తర్వులు వెల్లడించారు. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌కే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వరాదంటూ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి లేఖలు పంపి, వ్యతిరేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో రేవంత్ కీలకంగా ఉంటారని భావించిన పార్టీ ఆయనకే బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాదయాత్ర, టీఆర్ఎస్ భూ దందాలు, పలు నిర్ణయాలపై రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేవరయాంజల్ భూముల అంశంలో టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు రేవంత్‌రెడ్డి శతవిధాలా ప్రయత్నాలు చేశారు.
మరోవైపు ప్రస్తుతం టీపీసీసీ తాత్కాలిక చీఫ్‌గా ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి గతంలో దాదాపు మూడుసార్లు రాజీనామా లేఖ పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, హుజూర్నగర్ ఉప ఎన్నికల తర్వాత, ఇటీవల పంచాయతీ ఎన్నికలు, దుబ్బాక ఎన్నికల తర్వాత ఆయన పీసీసీ చీఫ్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ కోర్ కమిటీకి లేఖ పంపించారు. కానీ టీపీసీసీ చీఫ్ అంశంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఆయన్నే కొనసాగిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఉత్తమ్‌ను మార్చితేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయంటూ కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు.
పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు ఆయన టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన రేవంత్… 2006లొ మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. ఆ తర్వాత 2009, 2014లో కొడంగల్ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి అక్కడ రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన రావులపల్లి గుర్నాథరెడ్డిని ఓడించారు.
గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాల్లోకి దిగారు. ఆ తర్వాత 2017, అక్టోబర్‌లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరాడు. కాంగ్రెస్‌లో అప్పటి మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు విజయరమణారావు, సీతక్క, బోడ జనార్థన్, వేం నరేందర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావుతో పాటు మొత్తం 18 మంది సీనియర్ అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. అదే సందర్భంగా తన ఎమ్మెల్యే పదవికి కూఊడా రాజీనామా చేశారు. కాంగ్రెస్లొ చేరిన అనంతరం 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి హస్తం గుర్తుపై పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ ఓటమి లక్ష్యంగా ఇక్కడ టీఆర్ఎస్ భారీ వ్యూహాలు వేసింది. తక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలిచాడు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి మంత్రి మల్లారెడ్డి అల్లుడు, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డిపై గెలిచారు.
దూకుడు స్వభావంతో రాష్ట్రంలో పలు అంశాల్లో ప్రచారంలో ముందుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉంటారు. పలు వివాదస్పదమైన అంశాల్లో రేవంత్‌రెడ్డి ముందుంటారనే పేరుంది. ఇక 2015లో ఓటుకు నోటు కేసులో ఆయనపై కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అంతేకాకుండా 2020లో కూడా మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో కూడా రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారు. ఇలా జైలుకు వెళ్లిన అంశాన్ని సాకుగా చూపిస్తూ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రాకుండా కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్లు ప్రయత్నాలు చేశారు. బహిరంగ ఆరోపణలు కూడా చేశారు. కానీ అధిష్టానం ఆయనకే పగ్గాలు అప్పగించింది.
వద్దన్న కాంగ్రెస్‌లోనే ఇప్పుడు అధ్యక్ష పదవి
వాస్తవానికి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో చాలా వివాదంగా మారుతాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జనవరి 24న జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ సమైక్యవాది అని, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, గోల్డ్ మెడలిస్ట్ లు అయిన తమ ప్రాంత విద్యార్థులు నక్సలిజం వైపు మళ్లటానికి సమైక్య రాష్ట్రమే కారణమంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ఉన్నందునే కేసీఆర్ వెనక ప్రజలు అండగా నిలిచారని, 371 డి ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అడ్డుకాదని, దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని రేవంత్‌రెడ్డి గతంలో విమర్శలు చేశారు.
పాదయాత్రతో దూకుడు
రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పుడు ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన చేసిన పాదయాత్ర కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా మారింది. రాజీవ్ రైతు భరోసా యాత్ర పేరుతో ఆయన అనూహ్యంగా పాదయాత్రకు దిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేసిన సందర్భంగా రేవంత్‌రెడ్డి అనూహ్యంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. మొత్తం 8 రోజుల పాటు పాదయాత్ర చేసి రంగారెడ్డి జిల్లాలో ముగింపు సభను నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్లు గైర్హాజరు అయినా… చాలా మంది కాంగ్రెస్ నేతలు మాత్రం హాజరయ్యారు. దీంతో రేవంత్‌రెడ్డికి పార్టీలో మరింత ఇమేజ్ పెరిగింది.
కలిసి వచ్చేనా..?
ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ దక్కడంతో కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా అని పార్టీ శ్రేణులు ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పతనాస్థాయికి వెళ్లింది. ప్రతి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నాయకత్వలేమితోనే ఈ పరిస్థితి అంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది కేసీఆర్ కోవర్టులు కాంగ్రెస్‌లో ఉన్నారని, అందుకే పని చేసే నేతలకు సహకరించడం లేదంటూ విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ బాధ్యతలను రేవంత్‌కు అప్పగించింది. ఇప్పటికే దూకుడు, వివాదస్పద నేతగా పేరొందిన రేవంత్‌రెడ్డి… ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతం చేస్తారంటున్నారు. దీనికంటే ముందుగా ఆయన పలు అంశాలపై రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎట్టకేలకు ఆయనకే పీసీసీ చీఫ్ రావడంతో పార్టీపై కార్యకర్తల్లో ఆశలు మొదలయ్యాయి.
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. మహ్మద్ అజహరుద్దీన్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు.
పది మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు
అదే విధంగా పది మందికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. సంభాని చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేశ్ షెట్కర్, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి. కుమార్ రావు, జావేద్ అమీర్లను నియమించారు. అదే విధంగా ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యనిర్వాహణ కమిటీ ఛైర్మన్‌గా ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి నియమస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.