కిసాన్‌ నగర్ కేంద్రంగానే బ్లాక్ మార్కెట్..

by Sridhar Babu |
కిసాన్‌ నగర్ కేంద్రంగానే బ్లాక్ మార్కెట్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు నల్లబజారులో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అమ్మే ముఠాలకు కేరాఫ్ అడ్రస్‌గా కిసాన్ నగర్ మారినట్టుగా స్పష్టం అవుతోంది. కరీంనగర్‌లో ఇప్పటి వరకు రెండు ముఠాలను పోలీసులు కిసాన్ నగర్‌లోనే పట్టుకోవడం గమనార్హం. దీంతో కిసాన్ నగర్ ప్రాంతంలో అడ్డాలు ఏర్పాటు చేసుకున్న బ్లాక్ మార్కెట్ దందా గాళ్లు ఇదే ప్రాంతంలో ఎక్కువగా రెమిడెసివర్ ఇంజెక్షన్లు అమ్ముతున్నారు. కరీంనగర్‌లో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న మంచిర్యాల చౌరస్తా, చొప్పదండి రోడ్, డాక్టర్ స్ట్రీట్‌కు కిసాన్ నగర్ నుండి తొందరగా చేరుకునే అవకాశం ఉండడంతో పాటు ఆ ప్రాంతంపై పోలీసుల దృష్టి అంతగా పడదని భావించి ఇక్కడే ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. వ్యక్తిగత పనులపై వచ్చినట్టుగా బైక్ లపై తిరుగుతూ కొందరు, గల్లీల్లో అడ్డలు పెట్టుకుని కొందరు కిసాన్ నగర్‌ను షెల్టర్ జోన్‌గా మార్చుకుని రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అమ్ముతున్నట్టు సమాచారం.

ముఠాలు సరే… వారి సంగతేంటో..?

రెమిడెసివర్ ఇంజెక్షన్లు నల్ల బజారులో విక్రయిస్తున్న ముఠాలను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు పట్టుకోవడం బాగానే ఉన్నా లోతుగా దర్యాప్తు చేయడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంజెక్షన్లు అమ్ముతున్న వారి వెనకున్న వారిని పట్టుకునేందుకు పోలీసులతో పాటు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంజెక్షన్లపై కంపెనీ ఇచ్చే వివరాలను ఆధారం చేసుకుని విచారణ చేస్తే అసలు కారకులు దొరికే అవకాశం లేకపోలేదు. కంపెనీలు ప్రతి ఇంజెక్షన్ పై బ్యాచ్ నెంబర్ వేస్తుంటారు. ఏ బ్యాచ్ నెంబర్ ఏఏ డిస్ట్రిబ్యూటర్లకు సప్లై చేశారని, వారు ఏజెన్సీలకు ఏ బ్యాచ్ నెంబర్ ఇంజెక్షన్లు సరఫరా చేశారోనన్న వివరాలు ఖఛ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజెన్సీలు కూడా బ్యాచ్ నెంబర్ల వారిగానే ఇంజెక్షన్లను రిటేలర్లకు, ఆసుపత్రులకు, లేదా సంబంధిత మెడికల్ షాపులకు సప్లై చేస్తున్న వివరాలను రికార్డు చేస్తుంటారు. ఈ బ్యాచ్ నెంబర్లను ఆధారం చేసుకుని విచారిస్తే కేవలం ముఠాలే కాదు ఈ ముఠాలకు సరఫరా చేస్తున్న బడా వ్యాపారుల వ్యవహారం కూడా వెలుగులోకి వస్తుంది. మూలాలపై దృష్టి సారించి బ్లాక్ మార్కెట్ దందాకు సహకరిస్తున్న వారిపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో బ్లాక్ దందాకు చెక్ పెట్టినట్టవుంది. దీంతో కరోనా బాధితులకు కూడా సాధారణ ధరలకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు లభ్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వివరాలు ఆయా కంపెనీల నుండి కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్‌కు కూడా చేరే అవకాశాలు ఉన్నందున సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో దాడులు చేస్తే భారీ రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed