మానుకోట ఎక్సైజ్ ఆఫీసులో రిజిస్టర్ మాయం.. ఈ పని ఎవరిది..?

by Shyam |
మానుకోట ఎక్సైజ్ ఆఫీసులో రిజిస్టర్ మాయం.. ఈ పని ఎవరిది..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కార్యాల‌యంలో ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ మాయ‌మైన‌ట్లు స‌మాచారం. అత్యంత విశ్వస‌నీయ స‌మాచారం ప్రకారం… ఎక్సైజ్ కార్యాల‌యంలోని టాస్క్‌ఫోర్స్ విభాగానికి చెందిన ఉద్యోగుల హాజ‌రు రిజిస్టర్ ప‌ది రోజుల నుంచి కాన‌రావ‌డం లేదు. ఉద్యోగులు డ్యూటీకి హాజ‌రైంది, లేనిది తెలుసుకోవ‌డానికి ఉన్నతాధికారులు దీన్నే ప్రామాణికంగా భావిస్తారు. ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఇత‌ర‌త్రా అంశాల‌కు సంబంధించి కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ఉద్యోగులకు సంబంధించి అత్యంత కీల‌క‌మైన రిజిస్టర్ అనే చెప్పాలి. అయితే ప‌ది రోజులుగా రిజిస్టర్ క‌నిపించ‌కుండా పోయినా.. బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న అధికారి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవ‌హరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘ఏం భ‌య‌ప‌డ‌కండి.. కొత్త రిజిస్టర్ పెట్టి అంద‌రూ సంత‌కాలు పెట్టండి… అంద‌రూ కార్యాల‌యానికి వ‌చ్చిన‌ట్లే’ అంటూ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అభ‌యం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. వాస్తవానికి ఉద్యోగుల మ‌ధ్య కొద్దిరోజులుగా జ‌రుగుతున్న వివాదాలే రిజిస్టర్ మాయమ‌వ‌డానికి కార‌ణంగా తెలుస్తోంది. రిజిస్టర్ ఎవ‌రూ మాయం చేశారో తెలుసుకోవాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నట్లు స‌మాచారం అందుతోంది. ఇదిలా ఉండ‌గా కార్యాల‌యంలో ఉద్యోగులు ఇష్టానుసారంగా డిప్యూటేష‌న్‌పై ఇత‌ర స్టేష‌న్లకు వెళ్లడం ప‌రిపాటిగా మారింద‌ని తెలుస్తోంది. ఉన్నతాధికారులు దృష్టి పెడితే ఈ రిజిస్టర్ మాయం వెనుక విష‌యాలే కాకుండా, సిబ్బంది విధుల‌కు సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Advertisement

Next Story