ఓటు రిజిస్టర్ చేసుకుంటే ‘టెస్లా’ కారు!

by Shyam |
ఓటు రిజిస్టర్ చేసుకుంటే ‘టెస్లా’ కారు!
X

దిశ, వెబ్‌డెస్క్:

ఓటు అనేది ప్రతి పౌరుని బాధ్యత. అయితే ఓటు హక్కు వయస్సు వచ్చినా, ఓటు రిజిస్టర్ చేసుకోకుండా ఉండే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అందుకే ఎన్నికల సమయంలో వీలైనంత ఎక్కువ మంది ఓటు వేసేందుకు వీలుగా, ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇప్పుడు అమెరికాలో ఎన్నికల సీజన్ కాబట్టి స్వచ్ఛంద సంస్థలు అదే పని మీద ఉన్నాయి. కానీ హెడ్‌కౌంట్ అనే ఒక సంస్థ చేసిన ప్రయత్నానికి పెద్ద సంఖ్యలో రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం యూట్యూబర్ డేవిడ్ డోబ్రిక్. ఈ పేరు చెప్పగానే చాలా మంది యూట్యూబ్ వీక్షకులకు గివ్‌అవేలు, గిఫ్ట్‌లు గుర్తొస్తాయి. 8.06 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న తన చానల్‌లో డేవిడ్ తరచుగా గివ్‌అవే‌లు ఇస్తుంటాడు. ఆ క్రమంలోనే హెడ్‌కౌంట్ సంస్థతో కలిసి ఇప్పుడు డేవిడ్.. టెస్లా కార్లు గివ్‌అవేగా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. గత ఆదివారం వరకు కొనసాగిన ఈ గివ్‌అవే వల్ల ఎంతమంది కొత్త ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.

ఈ గివ్‌అవే ప్రోగ్రామ్‌లో భాగంగా ఎక్కువ ఓట్లు రిజిస్టర్ చేయించిన వారికి టెస్లా కారు గిఫ్ట్‌గా ఇస్తానని డేవిడ్ డోబ్రిక్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ల్లో ఉన్న హెడ్‌కౌంట్ వారి లింక్ ద్వారా ఫాలోవర్లు తమ స్నేహితులను, తెలిసిన వారిని ఓటు కోసం రిజిస్టర్ చేసుకునేలా చేయాలి. అలా ఎంత ఎక్కువ షేర్ చేసి, కామెంట్ చేసి రిజిస్టర్ చేయించగలిగితే వారికి టెస్లా కార్లు బహుమతిగా లభిస్తాయి. ఈ పోస్ట్ పెట్టిన 24 గంటల్లో దాదాపు లక్ష మంది అమెరికన్లు కొత్త ఓటు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఆదివారం నాటికి మొత్తం 350000ల పైచిలుకు మంది తమ లింక్ ద్వారా ఓటు కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు హెడ్‌కౌంట్ సంస్థ తెలిపింది. అయితే టెస్లా కార్లు ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Next Story