గురుకుల కాలేజీల రికార్డు

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల కాలేజీలు ప్రతిభ చాటాయి. రాష్ట్ర ఉత్తీర్ణత సగటు కంటే అధికంగా 91.77శాతం ఉత్తీర్ణత సాధించి గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. సీనియర్ ఇంటర్‌లో 2,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 2,030 మంది ఉత్తీర్ణులయినట్టు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. నాగార్జున‌సాగర్ బీసీ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక జూనియర్ ఇంటర్‌లో 2,329 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 2,033 మంది పాసయ్యారు. రాష్ట్ర సగటును మించి 87.29శాతం మంది జూనియర్ ఇంటర్‌లో పాసయ్యారు. జూనియర్ ఇంటర్‌లో జగదేవ్‌పూర్ గురుకుల కాలేజీ నుంచి ఎన్.సాయిప్రియ (466), వై.సౌజన్య (431), సీనియర్ ఇంటర్‌లో వనపర్తి నుంచి పి.గణేశ్ (989), మహేశ్వరం నుంచి జి.రవితేజ(983) అత్యధిక మార్కులు సాధించారు. రెండు ఏడాదిల్లో కలిపి 2,916 మంది ఏ గ్రేడ్ సాధించారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story