హైదరాబాద్‌లో పెరిగిన డెంగీ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anukaran |   ( Updated:2021-08-27 02:52:28.0  )
హైదరాబాద్‌లో పెరిగిన డెంగీ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: డెంగీ కేసులు అధికంగా నమోదవడానికి గల కారణాలపై వైద్య శాఖ సమాలోచనలు చేయగా లార్వా పెరుగుదల అధికంగా ఉండటాన్ని గమనించింది. సాధారణంగా ఉండాల్సిన లార్వా పెరుగుదల శాతం కంటే హైదరాబాద్‌లో దాదాపు రెండు రెట్లు ఉన్నట్లు తెలిసింది. ఎంటమాలజీ అధికారులు తెలిపిన ప్రకారం సాధారణ లార్వా ఉత్పత్తి శాతం 25 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ నగరంలో ప్రమాదకరంగా 46 శాతంగా ఉన్నట్లు నేషనల్ వెక్టార్ బోర్నె డిసీసెస్ నివేదికలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం పట్టణాలకంటే తక్కువగా ఉన్నా.. లార్వా వృద్ధితో పాటు డెంగీ కేసులు తక్కువగా నమోదవడం గమనార్హం. గతేడాది హైదరాబాద్‌లో 34.5 లార్వా వృద్ధి రేటు ఉండగా ప్రస్తుతం 46 శాతంగా ఉంది. అంటే దాదాపు 12 శాతం పెరిగింది. అత్యధికంగా లార్వా వృద్ధి రేటు కలిగిన జిల్లాల్లో హైదరాబాద్, వనపర్తి, మేడ్చల్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెరుగుతున్న డెంగీ కేసులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులు సమాయత్తమయ్యారు.

రెండేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి..

రెండేళ్లుగా కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలను ప్రస్తుతం పెరుగుతున్న డెంగీ కేసులు భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడిపై దృష్టిసారించిన వైద్యాధికారులు ఒక్కసారిగా నమోదవుతున్న డెంగీ కేసులతో అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో సీజనల్ వ్యాధులతో పాటు డెంగీని ఎదుర్కోవడం వైద్యశాఖకు పెద్ద సవాల్‎గా మారింది. కరోనాతో పాటు వీటిని కూడా కంట్రోల్ చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. డెంగీ కేసులు తగ్గించాలంటే ముందుగా దోమల లార్వాని నిర్మూలించేందుకు సిద్ధమయ్యారు.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైనా డెంగీ మాత్రం వదలడం లేదు. ఇంట్లో ఉంటే డెంగీ ప్రబలే అవకాశాలు గతేడాది కంటే అధికమైనట్లు నివేదికలో వెల్లడయ్యింది. ఇంటి పరిసరాల్లోనే లార్వా పెరుగుదల అధికంగా ఉందని తెలిసింది. అయితే గతేడాది హైదరాబాద్‌లో ఈ పెరుగుదల 7.8 శాతం ఉండగా ప్రస్తుతం 9.2 గా ఉంది. అంటే దాదాపు 3 శాతం లార్వా వృద్ధిరేటు పెరిగింది. దీనికి గల కారణాలపై ఎంటమాలజీ అధికారులు యోచించగా గృహిణులు ఎంకరేజ్ చేస్తున్న మిద్దె పంట వల్ల ఆ నీటిలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది. అయితే నీటిని కుండీల్లో నిల్వ ఉంచడం వల్ల లార్వా పెరుగుదల అధికమవుతుందని గుర్తించారు.

అంతే కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సంపు, నీటి గోలాల్లో రోజులకొద్దీ నీటి నిల్వ ఉంచడం ద్వారా కూడా మరో కారణమని తెలుసుకున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో వాడి పాడేసిన సీసాలు, టైర్లలో వానకు నీరు చేరి అక్కడ లారా పెరుగుతున్నాయని గుర్తించి వాటిని తొలగించే పనిలో మున్సిపల్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. పల్లె పట్టణం అని తేడా లేకుండా ప్రజలను డెంగీ, మరే ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షించేందుకు గత కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులు, వైద్యశాఖ దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి లార్వాను అంతం చేసే పనిలో పంచాయతీ రాజ్, వైద్యాశాఖ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed