విక్రమ్ బత్రా, డింపుల్ రీల్ వర్సెస్ రియల్ లవ్‌స్టోరీ

by Shyam |   ( Updated:2021-08-15 05:09:31.0  )
విక్రమ్ బత్రా, డింపుల్ రీల్ వర్సెస్ రియల్ లవ్‌స్టోరీ
X

దిశ, ఫీచర్స్ : దేశ సరిహద్దులో సైనికుడిలా భారతమాతకు సేవ చేయాలని కలలుగన్న విక్రమ్ బత్రా, 23 ఏళ్ల వయసులో 13వ బెటాలియన్ జమ్మూ & కశ్మీర్ రైఫిల్స్ జవానుగా ఆర్మీలో పోస్టింగ్ పొంది తన కోరికను నెరవేర్చుకుంటాడు. ఆ తర్వాత అతను యుద్ధభూమిలోనే కెప్టెన్ స్థాయికి పదోన్నతి పొందాడు. కార్గిల్ వార్‌ను లీడ్ చేసి.. పాయింట్ 5140, పాయింట్ 4875 కొండలపై త్రివర్ణ పతాకం ఎగురేసిన ఆ యుద్ధవీరుడి బయోపిక్‌గా బాలీవుడ్‌లో వచ్చిన చిత్రం ‘షేర్‌షా’. ఈ చిత్రంలో విక్రమ్ లవ్‌‌స్టోరీ అందర్నీ ఆకర్షించగా అతడి రియల్ లైఫ్ ప్రేమకథ గురించి తెలుసుకుందాం.

విక్రమ్ బత్రా, డింపుల్ చీమ లవ్ స్టోరీ ఏ తరం ప్రేమికులకైనా ఆదర్శనీయం. రీల్ లైఫ్‌లో చూపించిన విధంగానే.. నిజ జీవితంలో కూడా విక్రమ్ బత్రా, డింపుల్ చీమ చండీగఢ్‌లో తమ యూనివర్సిటీ రోజుల్లో కలుసుకున్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆమెను కలిసినప్పుడు పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషులో ఎంఏ చదువుతున్నాడు. ఆ ఇద్దరూ మొదట స్నేహితులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఇష్టాఇష్టాలు, మనసులు కలవడంతో వారి ప్రేమకథ మొదలైంది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డింపుల్ కుటుంబం వారి సంబంధాన్ని నిరాకరించినప్పటికీ, ఆమె మాత్రం బత్రా ప్రేమకు అండగా నిలిచి అతడిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది.

డింపుల్, బత్రా హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి తరచుగా వెళ్లేవాళ్లు. అయితే ఓసారి ఆ ఆలయంలో ప్రదిక్షిణ చేస్తున్న సమయంలో బత్రా తన దుపట్టా పట్టుకొని డింపుల్ వెనుక నడిచాడట. (సినిమాలో మాత్రం దేవాలయానికి బదులుగా, సిద్దార్థ్, కియారా ఒక గురుద్వారాలో కనిపిస్తారు). అంతేకాదు సినిమాలో కియారాకు బొట్టు పెట్టేందుకు బత్రా తన సొంత రక్తాన్ని ఉపయోగిస్తాడు. నిజ జీవితంలో కూడా విక్రమ్, తన ప్రేయసి డింపుల్ నుదుటన కుంకుమ లేనప్పుడు, అతడు తన వాలెట్ నుంచి బ్లేడ్ తీసి బొటనవేలుకు గాయం చేసుకుని ఆమెకు తిలకం దిద్దేవాడు. విక్రమ్ సినిమా చేష్టలను ఎప్పడూ డింపుల్ ఆటపట్టించేది.

డింపుల్ తన జీవితమంతా విక్రమ్ బత్రాకు అంకితం చేసింది. అతడి ప్రేమ జ్ఞాపకాలను నిత్యం గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా తన జీవనం కొనసాగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed