కార్పొరేట్ల చేతిలో బ్యాంకులుంటే ప్రమాదమే : ఎస్ అండ్ పీ

by Harish |
కార్పొరేట్ల చేతిలో బ్యాంకులుంటే ప్రమాదమే : ఎస్ అండ్ పీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ బ్యాంకుల్లో కార్పొరేట్ యాజమాన్యాన్ని అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంతర్గత కమిటీ ప్రతిపాదించడంపై ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సోమవారం ఆందోళనను వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా బడా కార్పొరేట్ కంపెనీల డీఫాల్ట్‌ల నేపథ్యంలో బలహీనమైన కార్పొరేట్ వ్యవస్థకు ఈ అవకాశమివ్వడం ప్రమాదంలోకి నెట్టినట్టేనని రేటింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థలు సొంత బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించడం వల్ల ఆర్థిక స్థిరత్వం ప్రమాదానికి గురవుతుందని తెలిపింది.

ఆర్థిక రంగం బలహీనంగా ఉన్న సమయంలో ఆథికేతర రంగంలోని సంస్థల పర్యవేక్షణలో ఆర్‌బీఐ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఏజేన్సీ అభిప్రాయపడింది. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ సంస్థలు డీఫాల్ట్‌లను కలిగి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ చేతిలోకి బ్యాంకులను ఇవ్వడం సరైంది కాదని ఎస్ అండ్ పీ ఓ ప్రకటనలో పేర్కొంది. గతవారం, ఆర్‌బీఐ బ్యాంకులను ప్రోత్సహించేందుకు బడా కార్పొరేట్ సంస్థలకు సొంతంగా బ్యాంకులను ఏర్పాటు చేసుకునే అవకాశం, అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలని అంతర్గత కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు, ఆందోళనలు వెలువడుతున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బ్యాంకింగ్ రంగం నీరసిస్తుందని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కూడా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story