ఆర్‌బీఐ మార్పు మంచిదేనా!?

by Harish |
ఆర్‌బీఐ మార్పు మంచిదేనా!?
X

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష భేటీలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే అంశంపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. అలాగని పారిశ్రామిక వర్గాలకు మేలు జరిగేలా వడ్డీ రేట్లను తగ్గించలేదు. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న మందగమన పరిణామాలను విస్మరించడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మందగమన పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం ఆర్థిక విశ్లేషకుల్లో చర్చకు దారి తీసింది. గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మందగమనాన్ని నియంత్రించే విధానాన్ని ప్రకటించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై ఆర్‌బీఐ సైతం అదే ధోరణిలో వ్యవహరించడం స్పష్టంగా తెలుస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2019-20 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా నమోదయ్యే అవకాశముందని ఆర్‌బీఐ ఎంపీసీ కమిటీ అంచనా వేసింది. గత డిసెంబర్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. ఈ కారణంగానే ఆర్‌బీఐ రేట్ల కోతకు తలొగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న మందగమన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ వరకూ ఎటువంటి కోతలు ఉండకపోవచ్చు.

అయితే, ఆర్‌బీఐ ద్రవ్య నిర్వహణా విధానాన్ని సవరించింది. ఈ నిర్ణయంతో వ్యవస్థలో తగినంత నగదు సరఫరా జరుగుతుందని అభిప్రాయపడింది. తద్వారా ఉత్పాదక రంగాలకు తగిన బలం వస్తుందని నమ్ముతోంది. సవరించిన ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ సగటు కాల్ రేట్‌ను ఖరారు చేసింది. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీలో కొన్ని మినహాయింపుల్ని ప్రకటించింది. బ్యాంకులు ఆర్‌బీఐకి చెల్లించే నగదు నిల్వ నిష్పత్తిలో మినహాయింపులను ఇచ్చింది. ఆటోమొబైల్ లోన్‌లు, హౌసింగ్ లోన్‌లు, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఇచ్చే లోన్‌లను మినహాయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బ్యాంకులు మరిన్ని లోన్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. ఈ కారణంగానే గురువారం ఆర్‌బీఐ సమీక్షా సమావేశం అనంతరం స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ రంగం షేర్లు అనూహ్యంగా లాభాల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం కొంతమేరకు సానుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ సాధారణ ప్రజల్లో కొనుగోలు శక్తిపై ఎంతమేరకు ప్రభావితం చూపిస్తుందనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed