సెకెండ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్

by Shamantha N |
సెకెండ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ గతేడాది కంటే చాలా దారుణంగా కొనసాగుతోంది. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, మెడికల్ ఆక్సిజన్, ఔషధాలు, ఆసుపత్రుల్లో పడకల కొరత లాంటి అంశాలు సెకెండ్ వేవ్ తీవ్రమవడానికి కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రెండోసారి అత్యంత వేగంగా పుంజుకోవడానికి ‘సరైన నాయకత్వం లేకపోవడమని’ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. 2020లో కరోనా గరిష్ఠ స్థాయికి చేరుకుని, తిరిగి తగ్గిపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. సరైన నాయకత్వం లేకపోవడం, భవిష్యత్తులో సవాళ్లను అధిగమించే స్థాయిలో దూరదృష్టి లేకపోవడం వల్లనే అని ఆయన కారణాలను వెల్లడించారు.

ఇతర దేశాల్లో సెకెండ్ వేవ్ పరిణామాలను గమనించి అవసరమైన జాగ్రత్తలను తీసుకోవడం, ప్రజలను హెచ్చరించడం, కరోనా ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాల్సిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా కరోనా మహమ్మారిపై పోరాడి విజయవంతమైనట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారని, ఆ తర్వాత కేసులు పెరగడం, ఏప్రిల్‌లో అత్యంత వేగంగా విజృంభించినట్టు రాజన్ తెలిపారు. కాగా, రాజన్‌తో పాటు పలువురు ఆర్థికవేత్తలు అజాగ్రత్త వల్ల భారత్ కొవిడ్‌తో బాధపడుతోందని, ఇంకా కొనసాగుతున్న కారణంగా పరిశ్రమ వర్గాలు, వైద్య నిపుణులు కనీసం కొన్ని వారాలు లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. ఆర్థికవ్యవస్థ గతేడాది ఎదుర్కొన్న స్థాయిలో తీవ్ర నష్టం కారణంతో కేంద్రం వెనకడుగు వేస్తోంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కఠినమైన లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story