గబ్బా గెలుపు వెనుక రవిశాస్త్రి

by Shyam |
గబ్బా గెలుపు వెనుక రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన టీమ్ ఇండియాపై అనేక ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో నెల రోజుల్లో ఓటమి నుంచి విజయాల వైపు పయనించిన తీరుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన జట్టు.. ఆసీస్ కంచు కోటైన గబ్బాలో రికార్డు ఛేదన ఎలా చేయగలిగిందనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే దీనిపై భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సమాధానమిచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీధర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన రవిశాస్త్రి ఆటగాళ్లకు ఒకే ఒక సలహా ఇచ్చాడు. ‘మీ స్లీవ్స్ మీద 36 అనే బ్యాడ్జ్ ధరించండి.

అది మీకు దారుణమైన ఓటమిని ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంటుంది. అప్పుడు మీలో గెలవాలనే కసి పెరుగుతుంది. తప్పక మీ ఆటతీరులో మార్పు వస్తుంది. మీరొక గొప్ప జట్టుగా తయారవుతారు’ అని శాస్త్రి చెప్పనట్లు శ్రీధర్ వెల్లడించారు. రవి చెప్పినట్లుగానే 30 రోజుల్లో టీమ్ ఇండియా ఘోర ఓటమి నుంచి టెస్టు సిరీస్ గెలిచే స్థాయికి చేరుకుందన్నాడు. మరోవైపు కోహ్లీ వెళ్లే ముందు అనేకసార్లు కోచ్, అజింక్య రహానేతో కలసి మాట్లాడాడు. జట్టు ఎలా ఆడాలో కొన్ని వ్యూహాలు చెప్పాడు. వాటిని కూడా అమలు చేయడం వల్లే గొప్పగా గెలిచామని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. మరోవైపు భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించడం వెనుక కెప్టెన్ కోహ్లీ, రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కృషి ఉందని ప్రశంసించాడు.

Advertisement

Next Story

Most Viewed