ప‘రేషన్’​.. రాష్ట్రంలో నిలిచిన బియ్యం పంపిణీ

by Anukaran |   ( Updated:2021-06-12 09:27:45.0  )
ప‘రేషన్’​.. రాష్ట్రంలో నిలిచిన బియ్యం పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పేదల బియ్యానికి బ్రేక్​పడింది. ఉచిత రేషన్​పంపిణీ ఐదు రోజులకే ఆగిపోయింది. సరిపడా బియ్యం నిల్వలున్నా.. సరఫరా చేసే వాహనాలు లేక రేషన్ షాపులకు తాళాలు పడుతున్నాయి. దీంతో ఇంకా లక్షల మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉచిత రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే డీలర్లు డీడీలు చెల్లించి ఉన్నప్పటికీ.. బియ్యం మాత్రం ఇంకా రావడం లేదు. దీంతో రేషన్ షాపుల్లో బియ్యం నో స్టాక్​ అంటూ బోర్డులు పెడుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెల్ల రేషన్​కార్డులోని ప్రతీ లబ్ధిదారునికి 15 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల రేషన్​కార్డులు ఉండగా, 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రతినెలా రూపాయి కిలో బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తుండగా.. ప్రతీ నెలా 1.78 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి అదనంగా 9 కిలోలు కలిపి మొత్తం 15 కిలోలు ఇస్తుండటంతో ఈసారి 2.53 లక్షల మెట్రిక్​టన్నులు అదనంగా అవసరమవుతాయని అంచనా వేశారు. జూన్​ కోటా కింద మొత్తం 4.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నాయి. అయితే యాసంగిలో ఎఫ్‌సీఐ బియ్యం నిల్వలు ఖాళీ చేయకపోవడంతో స్థానికంగానే అందుబాటులో బియ్యం ఉన్నాయి.

లారీలు లేవు..

రాష్ట్రంలో ఈసారి విపత్కర పరిస్థితి నెలకొంది. ప్రతీ సారీ బియ్యం సరిపోకపోవడంతో రేషన్ పంపిణీ నిలిపివేస్తారు. కానీ ఈసారి పుష్కలంగా బియ్యం ఉన్నా.. వాటిని సరఫరా చేసే లారీలు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. పీడీఎస్ బియ్యాన్ని సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోళ్లు, సరఫరాకు వినియోగిస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం ఎగుమతి చేసుకుని వెళ్తున్న లారీలు సకాలంలో తిరిగి రావడం లేదు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా రోజుల తరబడి ఉంటున్నాయి. దాదాపు 90 శాతం వాహనాలన్నీ ధాన్యం సరఫరాలోనే ఉన్నాయి.

బియ్యం లేవు..​

ఈ నెల పాత తరహాలోనే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు. అయితే ఎక్కడైనా రేషన్​తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో రేషన్​కార్డుదారులు ఈసారి బియ్యాన్ని తీసుకునేందుకు వెళ్లారు. అయితే అంచనాకు మించి రావడం, ఒక్కొక్కరికి ఎక్కువ కిలోలు ఇవ్వాల్సి రావడంతో బియ్యం రెండు, మూడు రోజులకే పూర్తయ్యాయి. రేషన్​దుకాణాల్లో నిల్వలు మొత్తం పూర్తయ్యాయి. దీంతో మళ్లీ బియ్యం కోసం ఇండెంట్ పెట్టారు. బియ్యం లేకపోవడంతో కార్డుదారులకు పంపిణీ ఆగిపోయింది.

ప్రస్తుతం బియ్యం వస్తేనే సరఫరా చేస్తామంటూ డీలర్లు చెప్పుతున్నారు. వాస్తవానికి ఈ నెల 5 నుంచే రేషన్​బియ్యం పంపిణీ మొదలుపెట్టారు. శనివారం నాటికే దాదాపు 6‌‌0 శాతం రేషన్ దుకాణాల్లో బియ్యం స్టాక్​లేదు. సగానికిపైగా లబ్ధిదారులు బియ్యం కోసం రోజూ తిరిగి వెళ్తున్నారు. లారీలను రప్పించి బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పేదవర్గాలు విన్నవిస్తున్నా.. ఎవరి దగ్గర నుంచి సమాధానం రావడం లేదు.

Advertisement

Next Story