మెదడును తినేసే అమీబా.. ఫ్లోరిడాలో ప్రత్యక్షం

by sudharani |
మెదడును తినేసే అమీబా.. ఫ్లోరిడాలో ప్రత్యక్షం
X

హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా అమెరికాలోని ఫ్లోరిడాలో నదుల్లో ఒక అమీబా ప్రత్యక్షమైంది. వెచ్చగా ఉండే మంచి నీరు ప్రవహించే నదుల్లో ఈ అమీబా నివాసముంటుంది. కాగా ఆ నదిలో సేదతీరడానికి వచ్చిన వారి శరీరాల్లో ముక్కు ద్వారా వ్యాపించి మెదడులోకి ప్రవేశించి, కొంచెం కొంచెంగా మెదడును తినేస్తుంది. ‘నెగ్లేరియా ఫౌలేరీ’ అని పిలిచే ఈ అమీబా ప్రస్తుతం ఫ్లోరిడా నదుల్లో కనిపించినట్లు ఫ్లోరిడా ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అందుకే నదుల్లో, కుంటల్లో దిగొద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ప్రత్యేక బోర్డులు పెట్టారు. ఇప్పటికే హిల్స్‌బర్గ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి ఈ అమీబా రోగం సోకినట్లు వారు నిర్ధారించారు.

అయితే ఈ అమీబా ఒకరి నుంచి ఒకరికి సోకదని, కేవలం నది నీళ్లలో దిగిన వారికి మాత్రమే సోకే అవకాశాలు ఎక్కువని వారు స్పష్టతనిచ్చారు. 1962 నుంచి ఇప్పటివరకు ఫ్లోరిడాలో ఇలాంటి అమీబా రోగం కేసులు 37 నమోదయ్యాయని రికార్డుల్లో ఉంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన అమీబా కావడం, అలాగే మానవ కంటికి సాధారణంగా కనిపించని జీవి కావడం వల్ల కేవలం నదుల ద్వారా మాత్రమే కాకుండా ఇతర నీటి వనరుల ద్వారా సోకే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత మేరకు నీటిని ముక్కులకు తగలనివ్వకుండా చూసుకోవాలని జులై 3న ఫ్లోరిడా మొత్తం హెచ్చరికలు జారీ చేశారు. ఈ జబ్బు సోకిన వారికి జ్వరం, వాంతులతో పాటు మెడ నొప్పి, తలనొప్పి కలిగి వారంలోనే చనిపోయే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించాలని ఫ్లోరిడా అధికారులు సూచించారు.

Advertisement

Next Story