ఆయనెక్కడా… ?

by Sridhar Babu |
ఆయనెక్కడా… ?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రోటోకాల్ గురించి ప్రజాప్రతినిధులు తరుచూ రచ్చ రచ్చ చేస్తుంటారు. నిభందనల ప్రకారం తమకు ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అవసరమైతే ఫిర్యాదులు కూడా చేస్తున్నవారూ లేకపోలేదు. కానీ ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ఆయన ఎక్కడ అన్న చర్చే సాగుతోంది. తమకు ప్రాధాన్యం కల్పించకపోతే ప్రోటోకాల్ అంశం లేవనెత్తే లీడర్లు, మరి దేవుని విషయానికి వస్తే ఇదే విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కాకుండా పోయింది.

కానరాని ఎమ్మెల్యే…

రాష్ట్రంలో అతి పెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దేశం నలుమూలల నుంచి 5 లక్షల మంది భక్తులు హజరవుతారని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆనవాయితీ ప్రకారం రాజన్న ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. ఈ సారి కూడా ఈ వస్త్రాలను స్వామి వారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినలపల్లి వినోద్ కుమార్, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. కానీ హెడ్ క్వార్టర్ లో ఉండాల్సిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రోటోకాల్ ప్రకారం వేములవాడ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రమేష్ బాబు ఉత్సవాల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. జర్మని పౌరుడేనని కేంద్ర హోం శాఖ హై కోర్టులో అఫడవిట్ సమర్పించిన తరువాత కూడా ఆయన తన నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఉత్సవాల్లో కనిపించకపోవడం అందరినీ విస్మయపరిచింది.

ఉత్సవాలకు ముందు కూడా భక్తుల కోసం ఏర్పాట్లు చేసేందుకు నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కూడా చెన్నమనేని రమేష్ బాబు హాజరు కాలేదు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా అధికారులు సమీక్షా సమావేశాలు జరిపారు. చివరకు మహా శివరాత్రి ఉత్సవాలకు కూడా హాజరు కాకపోవడంతో ఇంతకీ ఆయనెక్కడా అంటూ వేములవాడ జనం చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story