నీటిలోనే ఉస్మానియా వైద్యం.. పరేషాన్‌లో రోగులు

by Anukaran |   ( Updated:2020-07-15 22:11:06.0  )
నీటిలోనే ఉస్మానియా వైద్యం.. పరేషాన్‌లో రోగులు
X

అది తెలంగాణకే తలమానికంగా ఉన్న ఉస్మానియా దవాఖానా. వేలాది మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతూ ఉంటారు. వందలాది మంది డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు పని చేస్తూ ఉంటారు. అలాంటి ఆస్పత్రిలోకి ఒక్కసారిగా వరద నీరు చొచ్చుకుకురావడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ముందెన్నడూ వారికి ఇలాంటి అనుభవం లేదు. ఇటీవల దవాఖానా ఆవరణలో రోడ్లను మరమ్మతు చేశాకే మొదటిసారిగా ఈ పరిస్థితి ఏర్పడింది.

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రి చిగురుటాకులా వణికి పోయింది. భవనాలలోకి భారీగా వరద నీరు చేరింది. లక్షల రూపాయల విలువ జేసే డయాలసిస్ యంత్రాలు తడిసిపోయాయి. వాటిని కాపాడుకోవడానికి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అందరూ భయాందోళనకు గురయ్యారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో పాత భవనంతోపాటు కులి కుతుబ్ షా భవనం గ్రౌండ్ ఫ్లోర్ నీటితో నిండిపోయాయి. మోకాలి లోతులో నీరు రావడంతో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు సెక్యూరిటీ కార్యాలయంలోకి కూడా వరద నీరు చేరింది. ఫర్నిచర్ పూర్తిగా తడిసి పోగా, చెత్తను సమీకరించేందుకు నిల్వ ఉంచిన కవర్లు నీటిలో కొట్టుకుపోయాయి. మొత్తానికి భవనాలన్నీ అతలాకుతలమయ్యాయి. వర్షం తగ్గిన తర్వాత భవనం లోపల నిలిచిన నీటిని సిబ్బంది బయటకు పంపించారు.

ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం..

సుమారు వందేళ్ల చరిత్ర కల్గిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి గతంలో ఎన్నడు కూడా ఇలా వర్షం నీరు లోనికి రాలేదు. ఈ వర్షాకాలంలో పాత భవనంలోనికి నీరు చేరడం ఇది రెండవసారి. ఓపీ భవనం నుంచి కులీ కుతుబ్ షా భవనం మీదుగా పాత భవనం వరకు ఉన్న అంతర్గత రోడ్లకు కొన్ని నెలల క్రితం టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మత్తులు చేశారు. పాత భవనం పరిస్థితిని అంచనా వేయకుండా రోడ్డు ఎత్తును పెంచారు. రోడ్డు మద్యలో ఉన్న డ్రైనేజీలను పట్టించుకోకుండా మూసి వేశారు. నిజాం కాలంలో వేసిన డ్రైనేజీలు కొన్నిచోట్ల మూసుకు పోవడంతో వర్షం నీరు వెళ్లేందుకు దారి లేక పాత భవనంలోకి వచ్చి చేరుతోంది. పాత భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వార్డులలో బురదతో కూడిన వర్షం నీరు నిలిచిపోగా రోగులు అవస్థలు పడ్డారు. భవనం లోపలి నుంచి వరద నీరు డోమ్ గేట్ ద్వారా బయటకు వెళ్లడం.. చెరువు నుంచి తూము ద్వారా బయటకు వెళుతున్న నీటిని తలపించింది. అసలే పాతబడిన భవనాలలో బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తుంటే, ఇప్పుడు ఇదో కొత్త సమస్య వచ్చి పడిందని సిబ్బంది వాపోతున్నారు.

నేడు బండి సంజయ్ సందర్శన..

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గురువారం ఉదయం సందర్శించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరోనా కష్టపెడుతున్న సమయంలో ఆస్పత్రుల నిర్వహణ సరిగా లేకుండా పోతోందని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థతిని పరిశీలించేందుకే బండి సంజయ్ ఉస్మానియాకు వెళ్లనున్నారని వివరించాయి.

జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చాం..

ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. దీంతో పాత భవనం, కులీ కుతుబ్ షా భవనంలో వర్షం నీరు వచ్చి చేరింది. స్లాబు లీకవడంతో కొన్నియంత్రాలు పాక్షికంగా తడిశాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై సురక్షిత ప్రాంతానికి తరలించారు. పాత భవనంలో వరద నీటితోపాటు మట్టి కూడా చేరింది. సిబ్బందితో తొలగించాం. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించి శానిటైజేషన్, బ్లీచింగ్ చేయాలని కోరాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

– డాక్టర్ పాండు నాయక్, ఇన్ చార్జ్ సూపరింటెండెంట్

Advertisement

Next Story

Most Viewed