తనపై బురద చల్లే కుట్ర.. ఆ గర్భం నా వల్ల రాలేదు!

by Sridhar Babu |
తనపై బురద చల్లే కుట్ర.. ఆ గర్భం నా వల్ల రాలేదు!
X

దిశ, జగిత్యాల : రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు తనపై బురద చల్లేందుకు కుట్ర చేస్తున్నాయని రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు ఆవేదన వ్యక్తంచేశారు. రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై కావాలని బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నమని చెప్పుకొచ్చారు. గత 4, 5 రోజుల నుండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి కొంత అనుమానం కలిగిందని, కానీ ఇక్కడ రాయికల్లో వివిధ సంఘాల చైర్మన్లు ఉన్నారని అది ఎవరో అనుకున్నట్లు వివరించారు.

ఆ బాలిక గత 9 నెలలుగా తమ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుండేదని, ఆమె గర్భానికి కారణమైన అరవింద్ అనే యువకుడు మా ఇంట్లో వంట మనిషిగా, డ్రైవర్‌గా పని చేసే వాడని గుర్తుచేశారు. వారిద్దరి మధ్య ఏమి జరిగిందో తనకు తెలియదని మున్సిపల్ చైర్మన్ వెల్లడించారు. బాలిక గర్భవతి అని తనకు తెలియదని ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలిసిందన్నారు. దీనిపై శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎంక్వైరీ చేయగా బాధితురాలు అరవింద్ పేరు చెప్పిందని తెలిపారు. నిందితుడు అరవింద్ పలు సందర్భాల్లో అతని స్నేహితుల వద్ద నేరం ఒప్పుకున్నట్లు తెలిసిందన్నారు.

బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారమే పోలీసులు కేసు బుక్ చేశారని తెలిసిందన్నారు. ఆ అబ్బాయి ఎవరి ఒత్తిడితో తన పేరు తెరపైకి తెచ్చాడన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ఒత్తిడితోనే తనపై బురద చల్లడానికి జరిగిన కుట్ర అని వివరించారు. తాను ఒక లెక్చరర్‌గా పని చేశానని 70ఏళ్ల వ్యక్తిపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బాధితురాలు తన గర్భానికి అరవింద్ కారణమని కచ్చితంగా చెబుతుందని ఐనా ఇలా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు హన్మాండ్లు చెప్పారు.కొందరు సొంత పార్టీ నేతలే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వారిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed