చిన్న సంస్థల రుణాలను రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ!

by Harish |
చిన్న సంస్థల రుణాలను రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో మంగళవారం పలు కీలక అంశాలను చర్చించారు. కరోనా వైరస్ వల్ల ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఇవ్వాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, డిమాండ్‌ను పెంచడానికి ప్రజల చేతుల్లో నగదు చేరాలంటే కేంద్రం తక్షణమే భారీ ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని సూచించారు. నగదు బదిలీ పథకం పేదలకు తప్పనిసరిగా అందాలన్నారు. ఇది ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారినట్టు, లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని తగ్గించేందుకు లాక్‌డౌన్‌ను వీలైనంత త్వరగా ఎత్తేయాలని, కరోనా వైరస్ స్వభావం ఏంటనేది తెలుసుకోవాలని కానీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వెళ్తే సమస్య పెరుగుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదని బెనర్జీ చెప్పారు. ఆహార కొరత సమస్యపై స్పందిస్తూ..ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులివ్వాలని, అవి కనీసం మూడు నెలల వరకూ చెల్లుబాటయ్యేల చూడాలని బెనర్జీ అభిప్రాయపడ్డారు. అందరికీ బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, చక్కెర లాంటి నిత్యావసరాలను ఉచితంగా అందించాలని బెనర్జీ తెలిపారు. కరోనా వైరస్ లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్రాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్‌లను అమలు చేయాలని సూచించారు.

కరోనా వైరస్ తర్వాత ప్రభుత్వ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు..లాక్‌డౌన్ కారణంగా చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయని, ఉపాధి రంగంలోని చిన్న సంస్థల రుణాలను కేంద్రం రద్దు చేయాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం ద్వారా చిన్న సంస్థలకు భరోసా ఇవ్వడం ముఖ్యమన్నారు. గతవారం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో రాహుల్ గాంధీ చర్చను నిర్వహించారు. ఈ వారం నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో సంభాషించారు.

Tags: Abhijit Banerjee, coronavirus, Rahul Gandhi, small compenies

Advertisement

Next Story

Most Viewed