ఇంటింటా సర్వే సిబ్బందికి తంటా

by vinod kumar |
ఇంటింటా సర్వే సిబ్బందికి తంటా
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సులకు, ఏఎన్ఎంలకు మర్కజ్ తిప్పలు ఎదురవుతున్నాయి. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో లేవు. దీంతో ఇంటింటి సర్వే చేసి వివరాలను రాబట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే నర్సులతో పాటు ఏఎన్ఎంలను కూడా రంగంలోకి దించింది. కొన్నిచోట్ల ఫలితాలు వస్తున్నా చాలా చోట్ల వీరికి తిట్లు, అవమానాలు ఎదురవుతున్నాయి. సర్వేలో భాగంగా వివరాలు చెప్పాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నా తిట్లే సమాధానాలుగా వస్తున్నాయి. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వమే తమను పంపిందని ఎంత మొరపెట్టుకున్నా కొన్ని ఇళ్ళ వాళ్ళు వినడంలేదు. ఇంటి గేటు దగ్గరి నుంచే తిప్పి పంపేస్తున్నారు. కొద్దిమంది పరుష పదాలతో బెదిరిస్తున్నారు. నిజామాబాద్‌లో ఏఎన్ఎంలపై కాలనీవాసులు తిరగబడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే జరిగింది.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు, అనుమానిత వ్యక్తులను ఐసోలేషన్‌కు తరలిస్తూ 14 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే సర్వే సిబ్బందిని ప్రతి ఇంటికి పంపించి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైన వచ్చారా, కుటుంబంలో ఎవరైనా జలుబు లేదా జ్వరంతో బాధ పడుతున్నారా … తదితర విషయాలను తెలుసుకుంటున్నారు. దీనిపై మొత్తం రిపోర్టును తయారు చేసి పై అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందిని టీమ్‌లుగా ఏర్పాటు చేసి సర్వేకు పంపుతోంది ప్రభుత్వం.

అయితే సర్వే చేస్తున్న సిబ్బందికి ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడుతోంది. ”మీరు పదులు, వందల సంఖ్యలో ఇళ్లలో తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు. ఒకవేళ కరోనా అంటించి వెళ్తే ఎవరు బాధ్యులు” అంటూ ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. రోజుకొకరు సర్వేల పేరిట ఇంటికొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, ఇక ప్రభుత్వం లాక్‌డౌన్‌‌ విధించి లాభం ఏముందని క్లాస్ తీసుకుంటున్నారు.

ఇలాంటి తిట్లు, తిరస్కారాలు, బెదిరింపులు, అవమానాలు పడుతున్న నర్సులు, ఏఎన్ఎంలను ‘దిశ’ సోమవారం కవాడిగూడలో పలకరించింది. వారి ఆవేదన వారి మాటల్లోనే…

చాలా ఇబ్బందులు వస్తున్నాయి

”నా పేరు జ్యోతి ( పేరు మార్చాం). ప్రభుత్వం సర్వే చేయించే ప్రాంతాలకు వెళ్లినప్పుడు జనాల నుంచి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు ఇళ్లలోకి కూడా రానివ్వడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సర్వే చేయిస్తుందని చెప్పినా వినకుండా బూతులు తిడుతున్నారు. ముఖం మీదే గేట్లు వేస్తున్నారు.”

రెండ్రోజులు సెలవులు ఇవ్వాలి

”నా పేరు విమల ( పేరు మార్చాం). కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతానికి సిబ్బందిని పంపి సర్వే చేయిస్తున్నారు. ఉదయం 6గంటలకే డ్యూటీలో జాయిన్ అయి సాయంత్రం ఇంటికి వెళ్లే సరికి చాలా లేటు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజులు డ్యూటీ చేస్తున్నందున రెండ్రోజులైన సెలవు ఇస్తే కొంతమేర రిలీఫ్ అవుతాం.”

కుటుంబ సభ్యులను వెళ్లనీయట్లేదు

”నా పేరు దివ్య ( పేరు మార్చాం ). నేను కొద్దిరోజులుగా ఇంటింటి సర్వే టీంలో పనిచేస్తున్నాను. ఉదయం 6గంటలకు మా ఆయన నన్ను డ్యూటీ వద్ద దించి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మా ఆయన్ను పోలీసులు చెక్‌పోస్టు వద్ద ఆపుతున్నారు. ఎంత చెప్పినా వినిపించునే పరిస్థితుల్లో పోలీసులు ఉండటం లేదు. దీనిపై అధికారులు ఆలోచన చేయాలి.”

గ్లౌజులు, మాస్కులు సరిగా అందట్లేదు

”నా పేరు రాణి ( పేరు మార్చాం). ఇంటింటి సర్వేలో భాగంగా రోజుకు వంద ఇళ్లకు పైగా తిరిగి వివరాలు సేకరిస్తున్నాం. కానీ తమకు గ్లౌజులు, మాస్కులు సరిగా అందటం లేదు. డ్యూటీ చేస్తున్న సమయంలోనే స్వచ్ఛంద సంస్థల వాళ్లు ఇస్తేనే తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. దీంతో తమ ఆరోగ్యంపై కూడా భయాలు మొదలవుతున్నాయి. అధికారులు స్పందించి త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలి.”

Tags: Nurses, ANMs, Markaz, Home Survey, Coronavirus, Officers, Police, Hyderabad, Nizamabad, Check Post, Duties

Advertisement

Next Story

Most Viewed