ఆదిత్య ఠాక్రే మెడకు దిశా సాలియన్ హత్య కేసు?

by John Kora |
ఆదిత్య ఠాక్రే మెడకు దిశా సాలియన్ హత్య కేసు?
X

- అనుమానాస్పద మరణంపై తిరిగి దర్యాప్తు చేయాలి

- రాజకీయంగా ప్రేరేపితమై కప్పి పుచ్చారని ఆరోపణ

- ఆదిత్యా ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి

- బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దిశా తండ్రి సతీశ్ సాలియన్

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పదంగా మరణించారు. అయితే తన కూతురు మరణంపై తిరిగి దర్యాప్తు జరపించాలని తండ్రి సతీశ్ సాలియన్ తాజాగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమార్తెపై దారుణంగా దాడి చేసి హత్య చేశారని, ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి కారణంగా కేసును కప్పిపుచ్చారని సతీశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి మంత్రి, శివసేన-యూబీటీ నాయకుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్ ముంబై పోలీసుల ప్రాథమిక దర్యాప్తును సవాలు చేసేలా ఉంది. అంతే కాకుండా దిశా సాలియన్ మరణానికి, ఆ తర్వాత కొన్ని రోజులకు చోటు చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు మధ్య ఉన్న సంబంధంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. దిశా సాలియన్ మృతి కేసును ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా ముంబై పోలీసులు చిత్రీకరించారు. కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు, కథనాలు, ఇతర ఆధారాలను విస్మరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ త్వరలోనే హైకోర్టులో నమోదు చేస్తారని దిశా కుటుంబం తరపున వాదిస్తున్న న్యాయవాది నీలేష్ ఓజా స్పష్టం చేశారు. 2020 జూన్ 20న దిశా సాలియన్ మలాడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ భవనం 14వ అంతస్థు నుంచి పడిపోయి మృతి చెందారు. ఆ తర్వాత ఆరు రోజులకు (జూన్ 14)న సుశాంత్ తన బాంద్రా నివాసంలో చనిపోయి కనిపించారు.

Next Story