ఎస్టీపీల ఏర్పాటుకు స్థలం కేటాయించండి

by Sridhar Babu |
ఎస్టీపీల ఏర్పాటుకు స్థలం కేటాయించండి
X

దిశ, వరంగల్ టౌన్ : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ లో భాగంగా ఎస్ టీపీల ఏర్పాటుకు తక్షణమే స్థలం కేటాయించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పి. ప్రావీణ్య, కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే లతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ పురోగతి, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా మంచినీటి సరఫరా, భద్రకాళి చెరువు పూడికతీత తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సాకారం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత జూన్ లో వరంగల్ పర్యటన సందర్భంగా 4,500 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. త్వరితగతిన డీపీఆర్ సర్వే, డిజైనింగ్ తదితర పనులను పూర్తి చేసి ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జీడబ్ల్యూఎంసీలోని 66 డివిజన్లో 11 జోన్లుగా విభజించి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు 9 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో సర్వే పూర్తి చేశామని, మిగిలిన నాలుగు ప్రాంతాల్లో భూమి కేటాయించిన వెంటనే సర్వే పూర్తి చేసి డీపీఆర్ సమర్పిస్తామని కన్సల్టెన్సీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బిల్డ్ కాన్ ప్రైవేట్ సంస్థ ప్రతినిధి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీల ఏర్పాటు తదితర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సర్వే వేగవంతంగా కొనసాగుతుందని, పరుమార్లు సమీక్షలు, పరిశీలనలు కూడా చేసినట్టు చెప్పారు. 9 జోన్లలో సర్వే పూర్తయి డీపీఆర్ లు సిద్ధం చేశారని, మిగిలిన నాలుగు జోన్లలో సర్వే పూర్తి చేయిస్తామని కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ తో చర్చించి జీడీల డిజైన్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. వరంగల్ మహానగరంలోని 2025 జనాభా ధమాంష ప్రకారం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.

తాగునీటి సరఫరాపై మంత్రి సమీక్షిస్తూ బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. నగర ప్రజలకు ప్రతిరోజూ నీరందేలా చూడాలని, ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంకర్లకు అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. చేతి పంపులు, బోర్ వెల్స్, రిపేర్లు ఫ్లషింగ్లు చేయాలని మంత్రి సూచించారు. శానిటేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ శాఖలు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి కోరారు. ఏదైనా కారణం వల్ల మంచినీటి సరఫరా జరగకుంటే వెంటనే ఆ ప్రాంత ప్రజలకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ మహానగరం వ్యాప్తంగా ప్రతిరోజూ నాలుగు ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్, యానువల్​ మెయింటెనెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు లీకేజీలు అరికట్టడంతో పాటు సక్రమంగా నీరు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నగరంలోని పలు ప్రాంతాలకు రోజు విడిచి రోజు మంచినీరు అందిస్తున్నామన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పి.ప్రావిణ్య మాట్లాడుతూ ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని మండల ప్రత్యేక అధికారిగా నియమించి వరంగల్, హన్మకొండ నగరాలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా మంచినీటి ఎద్దడి జరగకుండా అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వరంగల్ మహానగరంలోని విలీన గ్రామాలలోని పలు డివిజన్లో మంచినీటి సరఫరా కు సంబంధించిన ఫిర్యాదులు ప్రజల నుండి అందుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ క్రమం తప్పకుండా మంచినీరు అందెలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. భద్రకాళి చెరువులో 5 బ్లాకులుగా విభజించి మూడు బ్లాకులలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, రెండు బ్లాకుల్లో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి బల్దియా, ఇంజనీరింగ్, కూడా, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed