- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సొంత భూమి అయినా.. మళ్లీ కొనాల్సిందే!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీ పట్టాదారు పాసు పుస్తకంలో భూముల వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఉంటే సరిపోదు. ఓ సారి ధరణి పోర్టల్ కూడా సరి చూసుకోండి. విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారా? కొన్ని సర్వే నంబర్లు కనిపించడం లేదా? అయితే అవి మరొకరి పట్టాదారు పాసు పుస్తకంలో చేర్చారన్న మాట.. ఆ భూమి హక్కులు పొందాలంటే మళ్లీ కొనుగోలు చేయాల్సిందే. అవును నిజం.. మీ భూమియే. కానీ మళ్లీ కొనాలి. మీ తప్పేం లేదు. మీరు ఎవరికి అమ్మలేదు. ఎక్కడా సంతకం పెట్టలేదు. సాదాబైనామా కింద రాసివ్వలేదు. అయినా సరే.. వాళ్లను బతిలాడుకొని కొనుగోలు చేయాలి. డబ్బులు ఇస్తారా? లేదంటూ ఫ్రీగా చేయించుకుంటారా? అది మీ సమర్ధత మీద ఆధారపడి ఉంది. రెవెన్యూ అధికారులు అదే చెబుతున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లోనే పొరపాటు జరిగింది. అయితేనేం? శిక్ష మీకే విధిస్తారు. అదే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న ధరణి పోర్టల్ మహాత్మ్యం..’ ఇదే సమస్యతో ఇప్పుడు చాలా మంది బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొరపాటుగా భూములు వారి పేరిట రాసినట్లుగా గుర్తించినా తిరిగి సేల్ డీడ్ చేసేందుకు ససేమిరా అంటున్నారు.
ఇంకొందరు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివరాలను అప్‌లోడ్ చేసేటప్పుడు కొందరు అక్రమార్కులు సృష్టించిన ఈ విపత్తు రైతాంగాన్ని భయపెట్టిస్తోంది. ఇలాంటి సమస్యలు అత్యంత ఖరీదైన భూములు కలిగిన యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎవరి బాధ్యత?
భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేటప్పుడు అనేక పొరపాట్లు జరిగాయి. వీటి ద్వారా లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి యాధృశ్చికంగానో, ఉద్దేశ్యపూర్వకంగానో రికార్డులను తారుమారు చేశారు. ఒకరి భూమిని మరొకరికి రాశారు. కొన్ని సర్వే నంబర్లను మిస్ చేశారు. సీఎం కేసీఆర్ రికార్డులను ఎవరూ మార్చకుండా ప్రపంచమే అబ్బురపడే విధానమంటూ ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడేమో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పిదాలను సరిదిద్దే అవకాశమే లేకుండా చేశారు. పాత రికార్డులను చూసి సరి చేయడానికి నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపొచ్చు. కానీ తహశీల్దార్లు, కలెక్టర్లకు ఆ పని చేయడం ఇష్టం లేదు. ‘మీ చావు మీరు చావండి’ అంటూ రైతుల ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఎవరి పేరిటనైతే నమోదైనదో వారిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. లేదంటే కోర్టుకు వెళ్లి న్యాయం పొందాలని కొందరు కలెక్టర్లు సూచిస్తుండడం విశేషం. రికార్డులను తారుమారు చేసిన వారిని నిలదీయాల్సిన అధికారులేమో ‘ఆ భూమి మీదే అనడానికి గ్యారంటీ ఏమిటి’ అంటూ హక్కుదారులనే ప్రశ్నిస్తున్నారు. బాధ్యత మరిచిన తహశీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు, సీసీఎల్ఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీల వ్యవహార శైలితో రూ.కోట్లు విలువజేసే భూమి హక్కులు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు తీసుకుంటూ..
అనుకోకుండా లభించిన భూములను కొందరు బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.లక్షలు తీసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా గీసుకొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో అసలైన పట్టాదారుల నుంచి అక్రమంగా, నకిలీ మరణ ధ్రువపత్రాలను జత చేసి ఇతరులకు పట్టా చేశారు. వాటిని కుదవబెట్టి అప్పులు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు హక్కుల కోసం బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అక్రమంగా పొందిన భూములపై ధనార్జన చేస్తున్నారని తెలిసింది. ఇకనైనా ధరణి పోర్టల్‌లో తప్పుల తడకగా నమోదు చేసిన డేటాను సరిదిద్దకపోతే లక్షలాది మంది రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. కనీసం చేసిన తప్పులను సరి చేసేందుకు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఆప్షన్లనైనా ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.
కోర్టుకే వెళ్లండి
ఆలేరుకు చెందిన మాదాను లూర్వు మారయ్యకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వీరవల్లి రెవెన్యూ సర్వే నం.56/ఔ లో 1.07 ఎకరాలు ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకం కూడా జారీ అయ్యింది. ఇటీవల రైతుబంధు సొమ్ము ఖాతాలో డిపాజిట్ కావడం లేదు. విషయం తెలుసుకుంటే తన పేరిట ఉన్న భూమి పక్క సర్వే నంబరు పట్టాదారుడైన రాంభట్ల సాయిశశిధర్ పేరిట నమోదు చేశారు. ఎలాంటి క్రయ విక్రయాలు జరగలేదు. సంతకాలెక్కడా పెట్టలేదు. కానీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి రూ.కోటికి పైగా విలువజేసే భూమిని పట్టాదారుడికే తెలియకుండా మరొకరి పేరిట రాసేశారు. నిజానికి శశిధర్ అనే వ్యక్తికి కూడా తెలియదు. తహశీల్దార్ కార్యాలయంలోనూ క్రయ విక్రయాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్ కనిపించలేదు. తన భూమిని తిరిగి ఇప్పించాలంటూ బాధితుడు ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నారు. కానీ రెవెన్యూ అధికారులకు ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియడం లేదు. శశిధర్ అనే వ్యక్తి దగ్గర తిరిగి కొనుగోలు చేయడం(సేల్ డీడ్) తప్ప మరో మార్గమేదీ లేదన్నారు. పొరపాటుగా తనకు సదరు భూమిని రాసేశారని గుర్తించిన శశిధర్ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సర్వే నం.56/ఔ లో 1.07 ఎకరాలతో తనకు సంబంధం లేదని రాసిచ్చారు. ఆఖరికి గ్రామ పెద్దల ముందు కూడా అంగీకరిస్తూ కాగితం రాసిచ్చారు. దాన్ని సమర్పించినా రెవెన్యూ అధికారులు రికార్డులు సరి చేయడం లేదు. శశిధర్ వచ్చి సేల్ డీడ్ చేస్తే తప్ప మార్చడానికి వీల్లేదంటున్నారు. ఆయనేమో రిజిస్ట్రేషన్ చేయడానికి ససేమిరా అంటున్నారు. న్యాయవాది సూచన మేరకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధితుడి సంబంధీకులు ‘దిశ’కు వివరించారు. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్.. ఇలా ఎవరి దగ్గరికైనా వచ్చి చెప్పడానికి సిద్ధమంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయనంటూ భీష్మించుకొని కూర్చున్నారు. నిజానికి శశిధర్‌కు సర్వే నం. 56/ఓ లో 1.04 ఎకరాలు మాత్రమే ఉంది. దానికి తోడుగా వీళ్ల భూమిని కూడా జత చేశారు. అయితే 1.04 ఎకరాలు కూడా శశిధర్, మరి కొందరు కలిసి కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలో అతను అమెరికా వెళ్లిపోతున్నట్లు బాధితులకు తెలిసింది. తిరిగి ఎప్పుడొస్తారో కూడా తెలియదు. ఇదే విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతికి అన్ని ఆధారాలతో చూపించారు. ‘మేమేం చేయలేం. మీరు కోర్టుకు వెళ్లండి’ అని సలహా ఇచ్చినట్లు చెప్పారు. కోర్టుకు వెళ్తే ఎప్పుడు తేలుతుంది? ఖర్చులు ఎవరు భరించాలి? ఇక్కడ చేయని తప్పుకు శిక్ష వేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులను తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు బాగానే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్!
* జోగులాంబ గద్వాల జిల్లా కేపీదొడ్డి మండలం కుచినెర్లకు చెందిన తిమ్మప్ప భూమిని వేరే వాళ్ల పేరిట రాశారు. కొందరు రెవెన్యూ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే రాశారన్న అనుమానాలు ఉన్నాయి. అతను ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరి పేరిట రాశారో.. వారిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చెప్పారు. అతనేమో రూ.10 లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పుకు తానెందుకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకోవాలని ప్రశ్నించారు. లేదంటే కోర్టుకు వెళ్లమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని వాపోయారు.
* భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లో సర్వే నం.87/ఎలో కె.శ్రీనివాస్‌రెడ్డికి 1.06 ఎకరాలు ఉంది. ఓ ఎకరం భూమిని ఇతరులకు పట్టా చేశారు. వారసత్వంగా వచ్చిన తమ భూమిని ఇతరులకు ఎట్లా చేస్తారని అధికారులను ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లమని సూచించారు. అక్రమంగా పట్టా పొందిన వ్యక్తి ఇతరులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. తనలా చిట్యాల, మొగుళ్లపల్లిలో అనేక మంది భూములను ఇతరుల పేరిట రాశారని, కొట్టుకు చస్తున్నామన్నారు. అధికారుల అవినీతి, అక్రమాలతోనే జరిగినట్లు ఆరోపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు ఉన్నాయి.