‘వాటిని వదిలేసి… మోడీ, మోడీ అని కలవరిస్తుంది’

by Shamantha N |
‘వాటిని వదిలేసి… మోడీ, మోడీ అని కలవరిస్తుంది’
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె నినాదాన్ని వదిలి మోడీ.. మోడీ అని కలవరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పదేళ్లుగా బెంగాల్‌ను పాలించిన దీదీ.. రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఐదో విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా బర్దమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘మా, మాతి, మనుష్ (తల్లి, మాతృభూమి, ప్రజలు) పేరిట బెంగాల్‌ను పదేళ్ల పాటు పాలించిన దీదీ కొంతకాలంగా ఆ నినాదాన్ని వదిలిపెట్టారు. దాని స్థానంలో మోడీ.. మోడీ అని పదే పదే మాట్లాడుతున్నారు’ అని అన్నారు. ఎన్నికలు ముగుస్తూ ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో ఒత్తిడి, చికాకు పెరిగిపోతున్నాయని మోడీ ఎద్దేవా చేశారు. కారణం తనకు తెలుసు అనీ, ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సరళిని, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి దీదీకి మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. గడిచిన నాలుగు విడతల్లో కలిపి బీజేపీ వందకు మించి సీట్లు వస్తాయని, దీదీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

టీఎంసీ నాయకురాలు సుజాత మండల్ దళితులపై చేసిన వ్యాఖ్యలపైనా మోడీ స్పందించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. దళిత జాతి టీఎంసీ నాయకులను క్షమించదని అన్నారు. నాలుగో దశ పోలింగ్ రోజున ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుజాత.. ‘షెడ్యూల్డు క్యాస్ట్ వాళ్లు పుట్టుకతో అడుక్కుతినేవాళ్లు (బెగ్గర్స్ బై నేచర్). వాళ్ల కోసం మమతా బెనర్జీ ఎంతో చేశారు. అయినా కూడా బీజేపీ వాళ్లిచ్చే డబ్బుల కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. వాళ్లు బీజేపీకి ఓట్లను అమ్ముకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మోడీ ఘాటుగా స్పందించారు. ‘దీదీ మనుష్యులు బెంగాల్ దళితులను అవమానిస్తున్నారు. ఇది విని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నది. బెంగాల్ సీఎంకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ వ్యాఖ్యలను దీదీ ఖండించకపోవడం విచారకరం’ అని మోడీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed