శభాష్! భారత్ బయోటెక్ : ప్రధాని

by Anukaran |   ( Updated:2020-11-28 05:59:16.0  )
శభాష్! భారత్ బయోటెక్ : ప్రధాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి చూపుతున్న కృషిని ప్రశంసించారు. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పరిశోధనలు, క్లినికల్ ప్రయోగాలు, వస్తున్న ఫలితాలు, ప్రస్తుతం తయారీకి చేస్తున్న ఏర్పాట్లు తదితరాలన్నింటినీ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో చర్చించారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిపై వారు ప్రధానికి వివరించారు. క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలపై శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేసి ఆ సంతోషాన్ని ప్రధానితో పంచుకున్నారు. ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ అధికారులతో, వైద్య నిపుణులతో, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధానికి తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ ట్రయల్స్ పూర్తయిన తర్వాత వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఐసీఎంఆర్ అధికారులను అడుగుతున్నట్లు తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొందరగా వ్యాక్సిన్ తయారీకి నడుం బిగించి ఒక్కొక్క దశను దాటుకుంటూ దాదాపుగా ఉత్పత్తి స్థాయికి చేరుకోవడం పట్ల ప్రధాని అభినందనలు తెలియజేశారు. సుమారు గంట పాటు భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ ఎల్లా కృష్ణతోపాటు పలువురు శాస్త్రవేత్తలతో వ్యాక్సిన్‌కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు.

Advertisement

Next Story