గులాబీలతో గుల్కంద్‌ మిఠాయి..

దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచాన్నంతా చుట్టుకున్న కరోనా మహమ్మారి.. చిన్నా చితకా వ్యాపారాల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ప్రతి రంగాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బకొట్టిన ఈ వైరస్‌.. రైతాంగాన్నీ వదలడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంతో రైతులు కాస్త ఉపశమనం పొందారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో పూల రైతులు తమ దిగుబడినంతా చేలోనే వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రూ. వేలు, లక్షల విలువజేసే పూలన్నీ చెత్తకుప్ప పాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న గుల్కంద్ స్వీట్లను గులాబీపూలతో తయారుచేసి విక్రయించడం ద్వారా లాభాలను గడించవచ్చని పూల రైతులకు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా మొయినాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, షాద్‌నగర్‌, శంషాబాద్‌, మేడ్చల్‌, కీసర, ఘట్‌కేసర్‌ మండలాల్లో పూల సాగు అధికం. ఇక్కడి రైతులు వేల ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. ఇప్పుడు మార్కెట్లన్నీ క్లోజ్‌ కావడంతో పూలను తెంచకుండా చెట్ల మీదే వదిలేస్తున్నారు. ఈ పరిణామంతో వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పూల రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని రాట్నం ఫౌండర్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ కొండా కవితారెడ్డి కోరుతున్నారు. గులాబీ పూలను అనేక రకాలుగా వినియోగించే మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాస్త ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా పూలను పూజకో, ఫంక్షన్‌కో ఉపయోగిస్తుంటారు. కానీ, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తారనే విషయం చాలామందికి తెలిసుండదు. అయితే గులాబీలతో అనేక రకాల మిఠాయిలను తయారు చేసే వీలుంది. అంతేకాదు వీటిలో చాలా రకాలను ఇళ్లల్లోనే తయారు చేయడంతో పాటు మార్కెట్లోనూ విక్రయించొచ్చు. ప్రస్తుతం పూల మార్కెట్లు లేకపోవడంతో గులాబీలను చెత్తలో పడేస్తున్నారు. లేదంటే చెట్ల మీదనే వదిలేయడం వల్ల రాలిపోతున్నాయి. అయితే ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని పూలతో స్వీట్లు తయారు చేస్తే రానున్న కాలంలో సరికొత్త ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే అవకాశం ఉంది. కాగా గులాబీలతో తయారుచేసే గుల్కంద్‌ స్వీట్లకు ఉత్తరాది రాష్ర్టాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

స్వీట్ల రకాలు
గుల్కంద్‌ కప్‌ కేక్‌, స్టఫ్‌ గుల్కంద్‌ పాన్‌ లడ్డు, ట్రై కలర్‌ గుల్కంద్‌ లడ్డు, ట్రై కలర్‌ గుల్కంద్‌ లస్సీ, రోజ్‌ గుల్కంద్‌ కుల్ఫీ, లేమన్‌ గుల్కంద్‌ రోజ్‌ షర్బత్‌, రోజ్‌ కోకోనట్‌ లడ్డు, పాన్‌ గుల్కంద్‌ షేక్‌, హనీ గుల్కంద్‌ గుజియన్‌, పాన్‌ గుల్కంద్‌ రసగుల్లా వంటి వందల రకాల మిఠాయిలను గులాబీలతో చేసుకోవచ్చు. ఇలాంటి మిఠాయిలు ప్రధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో వడ్డిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ మెనూలోనూ ఈ స్వీట్లు కనిపిస్తాయి. ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన 101 రకాల మెనూలో ఇది కూడా ఉండటం విశేషం. మొఘల్‌ కాలం నుంచి ఈ మిఠాయి.. ఆరోగ్యానికి మేలు చేసేదని ఆయుర్వేదంలోనూ పేర్కొనడం గమనార్హం.

గుల్కంద్‌ తయారీ విధానం..
కావాల్సిన పదార్ధాలు : అరకిలో దేశీ గులాబీ పూల రెక్కలు, అరకిలో చక్కెర పొడి, రెండు చెంచాల సోంపు, నాలుగు చెంచాల తేనె, ఒక చెంచా యాలకుల పొడి, అర చెంచా కుంకుమ పువ్వు.
ఎలా చేయాలి ?
– రెక్కలను బాగా కడిగి ఒక రోజు ఆరనివ్వండి.
– ఒక పెద్ద గాజు పాత్ర/పింగాణి పాత్రలో పొడి చేసిన చక్కెరను కొంచెం తీసుకొని ఒక పొరగా పరచాలి. దాని మీద రెండు గుప్పిళ్ల గులాబీ రెక్కలు పరచాలి. ఆ తర్వాత చక్కెర, కొంచెం సోంపు, తేనె, యాలకుల పొడిని పరచాలి. ఇలా పొరలుగా మూడు, నాలుగు వరుసలుగా చేయాలి.
– తర్వాత పాత్రను తెల్లటి బట్టతో చుట్టి మూడు రోజుల పాటు ఎండలో ఆరబెడుతూ.. రాత్రి పూట ఇంట్లో పెట్టుకోవాలి.
– రోజుల్లో తినడానికి తయారవుతుంది.

ఉపయోగాలు
– శరీరంలో వేడి తగ్గుదల
– వడదెబ్బ నుంచి రక్షణ
– బద్ధకాన్ని నిరోధిస్తుంది
– గ్యాస్‌ నుంచి ఉపశమనం
– మంచి కాంతినిస్తుంది

ఇంట్లో ప్రయత్నించండి..
లాక్‌డౌన్‌ కాలంలో గులాబీ రైతుల పిల్లలు కూడా ఖాళీగా ఉన్నారు. కాస్త యూట్యూబ్‌ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే ఇంకా అనేక రకాల స్వీట్లను తయారు చేయొచ్చు. మార్కెట్‌ కోసం ప్రయత్నించొచ్చు. మంచి రోజులొస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ ఎదిగే అవకాశం ఉంది.

Advertisement