స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ రెడీగా ఉంది.. అమరవీరుల స్థూపం సాక్షిగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ రెడీగా ఉంది.. అమరవీరుల స్థూపం సాక్షిగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పినట్లుగానే శుక్రవారం ఉదయం రాజీనామా లేఖతో గన్‌పార్క్ వద్దకు వచ్చారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ అమలుపై రేవంత్ రెడ్డివి దొంగ ఒట్లు అని అని విమర్శించారు. రేవంత్ రెడ్డి హామీలో నిజాయితీ ఉంటే.. దేవుళ్లపై వేసిన ఆ ఒట్లలో నిజముంటే రాజీనామా లేఖతో గన్‌పార్క్ వద్దకు రావాలని మరోసారి ఛాలెంజ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆరు గ్యారంటీలు ఆగష్టు 15వ తేదీలోపు అమలు చేస్తే స్పీకర్‌కు ఇచ్చేస్తా అని ప్రకటించారు.

లేకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రావడానికి కుదరకపోతే.. కనీసం సిబ్బందితోనైనా రాజీనామా లేఖ పంపాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమని చెప్పారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఆగష్టు 15వ తేదీలోపు అయినా మాట నిలబెట్టుకుంటే సంతోషిస్తామని వెల్లడించారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని అన్నారు. అంతకుముందు పోలీసులకు హరీష్ రావు వివరణ ఇచ్చారు. తాను ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించలేదని.. నాతో పాటు కేవలం నలుగురం మాత్రమే వచ్చామని అన్నారు. కాగా, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు.



Next Story

Most Viewed