డెడ్​లైన్​ ముగిసింది.. ఇప్పుడేంచేస్తారు..?

by Anukaran |
డెడ్​లైన్​ ముగిసింది.. ఇప్పుడేంచేస్తారు..?
X

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలలో కాలయాపన జరుగుతోంది. జనవరి డెడ్​లైన్​గా సూచించినా విషయాలు కొలిక్కి రావడం లేదు. పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా బదిలీలు చేయడం లేదు. అటు ఏపీ నుంచి రావాల్సిన ఉద్యోగులకు సంబంధించిన అంశంలో సరైన నిర్ణయాలూ లేవు. మరోవైపు పీఆర్సీ అంశం సస్పెన్స్​ సినిమాలాగా రక్తి కట్టిస్తూనే ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిట్​మెంట్​ ను జనవరిలోనే ప్రకటిస్తారని, పదవీ విరమణ పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటారని ఆశతో చూశారు. దాదాపు 680 మంది జనవరిలో విరమణ పొందారు. ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగ్​ల అంశం ఇంకా సాగుతూనే ఉంది. కొన్ని శాఖల్లో పదోన్నతులను ఎంతో కొంత పూర్తి చేసినా పోస్టింగ్​ ఆర్డర్లు మాత్రం ఇవ్వడం లేదు. మరికొన్ని శాఖల్లో ప్రమోషన్ల కోసం కోర్టు కేసులు, సీనియార్టీపరమైన సమస్యలను కారణంగా చూపిస్తూ పదోన్నతులకు బ్రేక్​ వేశారు. నేరుగా నియమితులైన వారితో పాటు కిందిస్థాయి నుంచి వచ్చే వారి అంశంలో సీనియార్టీ ఇబ్బందులున్నా ఇంకా మార్గదర్శకాలు జారీ కాలేదు. దీంతో చాలా మందికి పదోన్నతులు నిలిచిపోయాయి. అలాగే, వైద్యారోగ్య శాఖతో పాటు ఎక్సైజ్​, పర్యాటక, దేవాదాయ, వ్యవసాయ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆదివారంతో గడువు ముగిసినట్లుగా భావిస్తున్నారు. పదోన్నతుల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్​ ఆదేశించినా అధికార వర్గాలు మాత్రం సాధ్యం కాదన్నట్టుగానే చెబుతున్నాయి.

అక్కడక్కడా కదలికలు

కొన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను కొంతమేరకు పూర్తి చేశారు. ఉదాహరణగా అబ్కారీ శాఖలో ఏఈఎస్​ నుంచి ఈఎస్​లకు పదోన్నతులిచ్చారు. సీఐ నుంచి ఏఈఎస్​ వాళ్ల జాబితానే సిద్ధం చేయలేదు. పంచాయతీరాజ్​ శాఖలో గ్రేడ్​‌‌ – 2 నుంచి గ్రేడ్​ –1కు పదోన్నతులు ఇచ్చారు. తర్వాత వారి జాబితా కూడా పెండింగ్​లోనే ఉంది. మార్కెటింగ్​లో కూడా 24 మందికి స్పెషల్​ గ్రేడ్​ కింద పదోన్నతులిచ్చారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖలో కూడా ఇంకా పెండింగ్​. పోలీస్​ శాఖలో డీపీసీ పూర్తి అయినా ఇంకా పదోన్నతులు ప్రకటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా కొన్ని శాఖల్లో కొద్దిమేర మాత్రమే ఈ ప్రక్రియ చేసినా, పోస్టింగ్​లు మాత్రం ఇవ్వడం లేదు. పదోన్నతులు కల్పించిన తర్వాత పోస్టింగ్​లు ఇచ్చి బదిలీలు చేయాల్సి ఉన్నా కేవలం ప్రమోషన్లకు పరిమితమయ్యారు. అబ్కారీ శాఖలో ఈఎస్​లుగా పదోన్నతులు వచ్చినా ఇంకా పాతస్థానాల్లోనే ఉన్నారు. రెవెన్యూలో పరిస్థితి కూడా అంతే. రిజిస్ట్రేషన్ల శాఖలో డిసెంబర్​ నుంచి పోస్టింగ్​లు లేవు. పోస్టింగ్​ల కోసం కూడా మార్పులు తీసుకువస్తామంటూ రాష్ట్ర ఉన్నతాధికారి ఫైల్​ను పెండింగ్​ పెట్టినట్లు చెబుతున్నారు.

మంత్రులు చెప్పడం లేదు

మరోవైపు పోస్టింగ్​ల కోసం మంత్రులదే తుది నిర్ణయమని అధికారవర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పదోన్నతులు వచ్చిన వారిని ఎక్కడెక్కడ భర్తీ చేయాలనే అంశంపై మంత్రులకు తీరిక లేదని చెబుతున్నారు. మంత్రులు చెప్పకపోవడంతో వారి పోస్టింగ్​ ఉత్తర్వులు సిద్ధం చేయడం లేదు. మంత్రులు ఖరారు చేసిన తర్వాతే పోస్టింగ్​లు వస్తాయంటూ స్పష్టంగా తెలియజేస్తున్నారు.

పీఆర్సీ… ఇంకెంత దూరం?

వేతన సవరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉద్యోగవర్గాలు వ్యతిరేక స్వరాలు అందుకున్నాయి. కమిషన్​ నివేదికలో ఫిట్​మెంట్​ను కేవలం 7.5 శాతానికే సూచించిన విషయం తెలిసిందే. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నీ ఫిట్​మెంట్​ పెంచాలని ముక్తకంఠంతో డిమాండ్​ చేస్తున్నాయి. వారిని బుజ్జగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా డిసెంబర్​ 29న తొలుత ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సీఎం కేసీఆర్​… విడుతలుగా అధికారులకు అనధికారిక షెడ్యూల్​ ఇచ్చారు. దీనిపై బహిరంగ ప్రకటన చేశారు. డిసెంబర్​ 31న బిస్వాల్​ కమిషన్​ నివేదిక ఇచ్చింది. దాన్ని జనవరి తొలి వారంలోనే అధ్యయనం చేసి, రెండో వారంలోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి, మూడో వారంలో కేబినెట్​ భేటీ ఉంటుందని, కేబినెట్​లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

కానీ పీఆర్సీ సీల్డ్​ కవర్​ను జనవరి ఆఖరి వారంలో ఓపెన్​ చేశారు. దీనిపై చాలా దుమారం మొదలైంది. నెలాఖరులోగా ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని అనుకున్నా చర్చలే ముగియలేదు. ప్రస్తుతం సీఎస్​ ఆధ్వర్యంలోని త్రీమెన్​ కమిటీ నివేదికలను సీఎం కేసీఆర్​కు ఇచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సంఘాలు సీఎం అపాయింట్​మెంట్​ కోరాయి. కానీ సీఎం కార్యాలయం నుంచి స్పందన లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాల్లో జనవరి డెడ్​లైన్​గా ఉన్నా చాలా అంశాలు పెండింగ్​లోనే ఉన్నాయి. దీంతో ఎంతకాలం సాగదీస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు అంశాలపై ఉపాధ్యాయవర్గాలు మళ్లీ తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ అంశం మళ్లీ చిచ్చు పెడుతోంది. జనవరిలో తేలుతుందని ఆశ పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్​ వస్తే ఇంకా సాగిదీతే.

Advertisement

Next Story

Most Viewed