- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రాంక్’ పేరుతో లైంగిక వేధింపులు.. ‘యూట్యూబ్’ సంగతేంటి?
దిశ, ఫీచర్స్ : చాలా వరకు ‘ఓటీటీ’ వెబ్ సిరీస్‌ల్లో శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస, సెక్సువల్ అబ్యూస్‌మెంట్ కనిపిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. దీంతో ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్‌షిప్ ఉండాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, ఇటీవలే అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో.. మరి ‘యూట్యూబ్’ సంగతేంటి? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ‘ప్రాంక్’ పేరుతో లైంగిక వేధింపులు.. బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, పబ్లిక్ ప్లేసుల్లోనే చిలిపి చేష్టలంటూ అమ్మాయిల చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా వల్గర్ కంటెంట్‌కు యూట్యూబ్ కేరాఫ్‌గా మారింది. నిజానికి ఒకరికి హాని కలిగించని విధంగా, ఫన్నీగా ఉండే ‘ప్రాంక్’ వీడియోల వల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ యూట్యూ్బ్‌లో ట్రెండ్ అవుతున్న ‘ప్రాంక్’ వీడియోలు మాత్రం చిన్నారులను తప్పుదోవ పట్టించే టాక్సిక్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తూ సొసైటీలో విష బీజాలు నాటుతున్నాయనడంలో సందేహం లేదు.
యూట్యూబ్‌లో చాలాకాలంగా ‘ప్రాంక్’ వీడియోల హవా నడుస్తోంది. కానీ అందులోని కొన్ని చానల్స్ మాత్రం ‘సెక్సువల్ అబ్యూస్’ పేరుతో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఈజీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లకు డేటా ఉంటే చాలు.. యూట్యూబ్ ఫ్రీ యాక్సెస్ అవకాశాన్ని కల్పిస్తుండటంతో ఎక్కువమంది చూస్తున్న అంశాల్లో ‘ప్రాంక్ వీడియోలు’ టాప్‌లో ఉంటున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. ప్రతి వీడియోకు వేలల్లో, కొన్ని సందర్భాల్లో మిలియన్ సంఖ్యలో వ్యూస్ లభిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
యూట్యూబ్ వేదికగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. తమ వీడియోలకు అనూహ్య స్పందన వస్తుండటంతో వాళ్లు కూడా అదేరకం కంటెంట్‌తో వీడియోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ‘ప్రాంక్’ వీడియోలు చేసే వారిది ఎంత తప్పో, వాటిని ప్రొత్సహిస్తున్న వారిది కూడా అంతే తప్పు. కానీ వీటికి సెన్సార్‌షిప్ లేకపోవడం, యూట్యూబ్ నిర్వాహకులు గానీ ప్రభుత్వం గానీ అడ్డుచెప్పకపోవడం వంటి కారణాలతో వీడియో క్రియేటర్స్ ప్రేక్షకుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్నారు. కాగా ఇలాంటి వీడియోలు వీక్షకుల్లో అభద్రతాభావాలను ప్రేరేపిస్తాయని, హానికరమైన సంబంధాలకు దారితీస్తాయని మానసిక నిపుణులు పేర్కొంటుండటం గమనార్హం.
శ్రుతిమించి..
భారతీయ సంస్కృతిలో కొన్ని విషయాలను ఎప్పటికీ సరదాగా తీసుకోలేం. మన భాషాసంస్కృతులను చెడుగా చూపించే కంటెంట్ విషయంలో కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ ప్రాంక్ వీడియోల విషయంలో అలా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ ప్రాంకింగ్’ అనేది మన నేచర్, భాష, కంటెంట్‌ల తిరోగమన చర్యకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇందులో పాశ్చాత్య ప్రభావం ఉన్నప్పటికీ.. విదేశీ జోకులు, హాస్యాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయలేం. వాస్తవికతను, ప్రాంతీయ హాస్యాన్ని మేళవించి తీస్తేనే వాటికి ఇక్కడ ఆదరణ దక్కుతుంది.
కానీ సున్నితమైన హాస్యానికి మంగళం పాడేసి.. సమాజంలోని సర్కాస్టిక్, వల్గర్ కామెడీని సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. డార్క్ కామెడీ దారిని ఎంచుకుని.. శ్రుతిమించిన, అసభ్యకరమైన ప్రాంక్ వీడియోల వైపు ప్రయాణిస్తున్నాం. ‘మేరా ఖేలా ముహ్ మే దాలో, మసాజ్ ప్రాంక్ ఆన్ గర్ల్, డ్రంక్ ప్రాంక్ ఆన్ గర్ల్‌ఫ్రెండ్, బెగ్గర్ ప్రాంక్ ఆన్ గర్ల్, లెస్బియన్ ప్రాంక్ ఆన్ గర్ల్’.. ఇలా చెప్పుకుంటూ పోతే పబ్లిక్ ప్లేసుల్లో అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించే వీడియోలను షూట్ చేసి, ప్రాంక్ పేరుతో ప్రసారం చేస్తున్నారు. నెటిజన్లు ఆకట్టుకునేందుకు, ప్రధానంగా యువతను అట్రాక్ట్ చేసేందుకు అసభ్యకరమైన హెడ్డింగ్స్(థంబ్ నెయిల్స్)తో పాటు వల్గారిటీని ప్రతిబింబించే పోస్టర్స్ డిజైన్స్ చేస్తున్నారు.
సరదా కూడా..
ఒకరికి హాస్యంగా తోచింది.. మరొకరికి అపహాస్యంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక్కోసారి సరాదా కోసం చేసిన చిలిపి పనే.. ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయొచ్చు. అమలాపాల్ లీడ్ రోల్ పోషించిన ‘ఆమె’ చిత్రంలో ఇదే విషయాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ప్రాంక్ వీడియోలకు నైతికత, ఎథిక్స్ అంటూ ఉండవు. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోరు. ప్రాంక్ పేరిట ఇప్పుడు ఎవరు ఎవరినైనా వేధించగలరు, పదిమందిలోనే అమ్మాయి చేయిపట్టి లాగడమో, ముద్దు పెట్టడమో చేసి.. ‘ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్’ అని చెప్పినా అడిగేవాడే లేకుండా పోయింది. ఈ వీడియోలు స్వేచ్ఛా సమాజంలో ఆందోళన, సమస్యాత్మక ప్రవర్తనలకు కారణమవుతున్నాయి.
బెదిరింపులు, వేధింపులు, అసభ్యత, అశ్లీలత వంటి విషపూరిత సంస్కృతికి, నేరచరితకు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రాంక్స్ వల్ల దొర్లిన తప్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగానే కాక ఇండియాలోనూ చనిపోయిన సందర్భాలున్నాయి. ఇటీవల కాలంలో ప్రాంక్స్ వీడియోలు అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మారుతుండటంతో పాటు పలువురు ఫ్రాంక్ క్రియేటర్స్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ ఫేమ్‌ను పొందుతున్నారు. దీంతో రెచ్చిపోతున్న ఫ్రాంక్ క్రియేటర్స్ బహిరంగ ప్రదేశాల్లోనే అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరిస్తున్నారు. అందుకే సామాజిక శాస్త్రవేత్త గ్యారీ అలాన్ ప్రాంక్ ‘ప్లేఫుల్ టెర్రిరిజం’గా అభివర్ణించాడు.
ఒకరిని చూసి, మరొకరు అన్నట్లుగా వ్యూస్ పెంచుకోవడం కోసం ప్రాంక్ స్టార్స్ అసభ్యతను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంక్స్ కొంతమంది ప్రజల గోప్యతను బహిరంగపరచడంతో పాటు కొన్ని సంబంధాలను నాశనం చేస్తున్నాయి, చిన్నారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా విస్తరిస్తున్న విష సంస్కృతి వ్యాప్తిని నిరోధించడానికి కఠినమైన చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థను విధించాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్/డిజిటల్ కంటెంట్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకు వచ్చినట్లే, ప్రాంక్ వీడియోలకు కూడా సెన్సార్‌షిప్ విధించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.