అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు

by Anukaran |   ( Updated:2020-09-01 08:20:31.0  )
అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ దాకు దేశం శాశ్వత వీడ్కోలు పలికింది. ప్రణబ్ ముఖర్జీ పార్థివ దేహానికి మంగళవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కొవిడ్ నిబంధనల నడుమ ఢిల్లీలోని లోఢి శ్మశాన వాటిలో అంతిమ సంస్కారాలు ముగిశాయి. కుటుంబీకులు, బంధువులు పీపీఈ కిట్‌లు ధరించే చివరి చూపు చూశారు. కుమారుడు అభిజిత్ బెనర్జీ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ప్రణబ్ దా పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. నివాసంలోనే ఏర్పాటు చేసిన ప్రణబ్ దా చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, సీపీఐ నేత డీ రాజా సహా పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రణబ్ ముఖర్జీ పట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపాన్ని ప్రకటించిందని, ఆయన గౌరవార్థం రెండు నిమిషాలపాటు మౌనాన్ని పాటించినట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది.

అనంతరం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి లోఢి శ్మశాన వాటికకు తరలించారు. కరోనా కారణంగా గన్ క్యారియేజ్‌కు బదులు మృతదేహాలను తరలించే వాహనం(వ్యాన్)లో తీసుకెళ్లారు. సైనిక లాంఛనాలు, గౌరవార్థం ఆకాశంలోకి కాల్పులు, సెల్యూట్ చేస్తూ ప్రణబ్ దాకు వీడ్కోలు పలికారు. వ్యాన్ నుంచీ ప్రణబ్ దా పార్థివ దేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన సిబ్బందే శ్మశానవాటికకు తరలించారు.

చివరి చూపునకూ మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించి, ఆరు అడుగుల దూరాన్ని పాటించారు. అనంతరం అభిజిత్ ముఖర్జీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రెయిన్ సర్జరీ కోసం ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి రికవరీ కాకముందే ఆయన తనువు చాలించారు. దీంతో ఆయన అంత్యక్రియల్లో ఆసాంతం కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed