ఆ గుడిలో హడావిడి జాతర వరకే.. అభివృద్ధి గాలికే..?

by Anukaran |
ఆ గుడిలో హడావిడి జాతర వరకే.. అభివృద్ధి గాలికే..?
X

దిశ, వేములవాడ: శివరాత్రి ఉత్సవాలు వస్తే చాలు అభివృద్ధి పేరిట హడావుడి చేసి, ఆ తరువాత ఆలయ అభివృద్ధిని గాలికి వదిలేస్తుంటారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతర కోసం రూ. కోటీ 80 లక్షల నిధులతో 32 పనులకు ప్రతిపాదనలు డిసెంబర్ మాసంలో తయారు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని తీర్మానం చేసి, టెండర్లను పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నత్తకు నడక నేర్పుతున్న చందంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నాసిరకంగా..

వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహా శివరాత్రి ఉత్సవాల్లో చేసే పనలు తాత్కాలికంగా, నాసిరకంగా ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయానికి ఏటా కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ పర్మినెంట్ పనులు చేపట్టకుండా, నామమాత్రంగా పనులు చేపడుతూ రాజన్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నిర్వహించే శివరాత్రి జాతరకు ముందే పనులకు ప్రతి పాదనలు చేసి, జాతర వారం రోజుల్లో ఉన్న సమయానికి నాసిరకం పనులు చేపట్టడం ఇక్కడి కాంట్రాక్టర్లు అనవాయితీగా మారింది. జాతర సమయంలో పనులు పూర్తి కాకపోతే అధికారులు కాంట్రాక్టర్ పై ప్రెషర్ తీసుకొచ్చి, ఎలాగోలా పనులు పూర్తి చేయాలని చేప్తుండడంతో నాసిరకంగా పనులు చేపడుతున్నారు.

శ్వాశత స్వాగత తోరణాలేవీ?

జాతరకు వచ్చే భక్తులకు కోసం స్వాగత తోరణాలు శ్వాశతంగా ఎందుకు నిర్మించరని, భక్తులతో పాటు పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నంది కమాన్, నాంపల్లి కమాన్, జగిత్యాల కమాన్, కోరుట్ల బస్టాండ్ కామన్లు ఉండగా, వాటి పక్కనే స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటికే స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి, లైటింగ్ పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా వేములవాడ పట్టణంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు.

నాసిరకం పనులు..

జాతర సందర్భంగా చేపట్టే పనులన్ని నాసిరకంగానే ఉన్నాయి. వాటిని తనిఖీ చేయాల్సిన ఇంజినీరింగ్ అధికారులు అటు వైపు కూడా రాకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. స్వామి వారి గోపురానికి, కమాన్లకు, గోడలకు వేయాల్సిన రంగుల్లో నాణ్యత లోపించింది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ప్యాచ్ వర్క్స్ సైతం తూతూ మంత్రంగా చేస్తున్నారు. జాతర రాకముందే సిమెంట్ లేచి, ఎప్పటి మాదిరిగానే తయారయ్యాయి. ఇప్పటికైనా ఆలయంలో చేపట్టే పనులకు పర్మినెంట్ పనులు చేపట్టి, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, జాతర సమయంలోనే పనులు చేయవద్దని భక్తులు, పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story