- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ డే..
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల పోరులో నేడు అత్యంత కీలక ఘట్టం. పశ్చిమబెంగాల్ మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ నేడే ముగియనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతుండగా.. అసోంలో చివరిదైన మూడో దశ, బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలకు గాను నేడు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సర్వం సిద్ధం చేసింది. కాగా ఇప్పటివరకు పలు సంస్థలు విడుదల చేసిన సర్వేల ప్రకారం అసోం, తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలే అధికారం చేజిక్కించుకోనున్నాయని అంచనా వేశాయి. ముఖ్యంగా దక్షిణాదిలో పాగా వేయాలని శత విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. బెంగాల్, అసోంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వస్తానని సంకేతాలిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.
బెంగాల్ హీట్..
తొలి రెండు దశల మాదిరిగానే మూడో విడత ఎన్నికలు కూడా పశ్చిమబెంగాల్‌లో హైఓల్టేజీ వాతావరణంలో జరుగుతున్నాయి. 31 అసెంబ్లీ స్థానాలలో 78.52 లక్షల మంది ఓటర్లు 205 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సౌత్ 24 పరగణాస్ లో 16 నియోజకవర్గాలు, హౌరాలో 7, హుగ్లీలో 8 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. టీఎంసీ, బీజేపీలతో పాటు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) కూడా పలు చోట్ల ప్రభావితంగా ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో టీఎంసీ గంపగుత్తగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికలలో మాత్రం ఈ ప్రాంతంలో బీజేపీ బలం పుంజుకుంది. ముఖ్యమంత్రి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పార్లమెంటు నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ స్థానాలుండగా.. నేడు ఆ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. గత రెండు విడతల మాదిరిగానే ఈ 31 స్థానాలు కూడా 618 కేంద్ర కంపెనీ బలగాల కాపలా నడుమ కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.
తమిళా..? హిందీనా..?
ద్రవిడ వాదాన్ని బలంగా వినిపించిన ఇద్దరు దిగ్గజ నేతలు లేకుండా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బీజేపీతో జతకట్టినా, కరుణానిది కాంగ్రెస్‌తో కలిసి నడిచినా ద్రవిడవాదాన్ని మాత్రం విడనాడలేదు. ఇప్పుడు వీరిరువురూ లేరు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్యే పోటీ ఉంది. రెండో సారి సీఎం కావాలని పళనిస్వామి, తొలిసారి సీఎం కావాలని స్టాలిన్ ఉవ్విళ్లూరుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఏఐఐడీఎంకే భావిస్తుండగా.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేకే ఈసారి అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) తో పాటు టీటీవి దినాకరన్ అమ్మా మక్కల్ మున్నెట్ర కజగం (ఎఎంఎంకే)లు ఓట్లను చీల్చే అవకాశం ఉంది. వైకో, విజయ్‌కాంత్ పార్టీలు పట్టు నిలుపుకోవాలని చూస్తున్నాయి. అన్నాడీఎంకేతో బీజేపీ, డీఎంకేతో కాంగ్రెస్ జట్టుకట్టినా వాటి పోటీ నామమాత్రమే. కానీ అన్నాడీఎంకే ముసుగున ఇక్కడ పాగా వేయడానికి బీజేపీ యత్నిస్తున్న వేళ తమిళ ఓటరు ఎటు మొగ్గుచూపుతాడోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ ఎన్నికలలో 3,998 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శాసనసభ ఎన్నికలతో పాటు కన్యాకుమారి పార్లమెంటు నియోజకవర్గానికి ఉపఎన్నిక కూడా జరుగుతుంది.
కేరళ.. వామపక్షమేనా..?
2.74 కోట్ల ఓటర్లున్న కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 957 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీ ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలు పోటాపోటీ ప్రచారం నిర్వహించిన కేరళలో ఈసారి ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ యత్నిస్తున్నది. శబరిమల అంశంతో పాటు గోల్డ్ స్కామ్ కుంభకోణాన్ని ప్రచారంలో ఆ పార్టీ ముందుకు తీసుకెళ్లింది. మెట్రోమ్యాన్ శ్రీదరన్ తో పాటు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకు, సినీ తారలకు టికెట్లిచ్చిన బీజేపీ.. ఎంతమేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మలప్పురం లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.
అసోం.. చివరి దశ
ఇప్పటికే రెండు దశలు ముగిసిన అసోంలో నేడు తుది విడత పోలింగ్ జరగనుంది. 40 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 337 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 12 జిల్లాల పరిధిలో జరిగే ఈ ఎన్నికలలో బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు, రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీలో ఉన్నారు. సీఏఏ, ఎన్నార్సీ ప్రధాన అస్త్రాలుగా సాగిన పోటాపోటీ ప్రచారం ఆదివారానికి ముగిసిన విషయం తెలిసిందే.
పుదుచ్చేరి మొగ్గు ఎటువైపో..
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా నేడు ఓటింగ్‌లో పాల్గొననుంది. 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పుదుచ్చేరిలో 10 లక్షల మంది ఓటర్లు 324 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమొక్రటిక్ అలెయన్స్, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రధానంగా ఉన్న ఎన్డీయే కూటమి మధ్యే ఉంది. మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు