కుప్పంలో గుండా రాజకీయం నడుస్తుంది.. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి

by srinivas |
amarnath
X

దిశ, ఏపీ బ్యూరో: కుప్పంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి గృహ నిర్భందంలో ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి తప్పించుకొని బుధవారం కుప్పంలోని తెలుగుదేశం కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కుప్పంలో వైసీపీ గుండాలు రౌడీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరగకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మేమేమన్నా తీవ్రవాదులమా.. అర్ధరాత్రి అరెస్టు చేయడానికి అని పోలీసులపై ధ్వజమెత్తారు.

వైసీపీ నాయకులు కుప్పంలోని టీడీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి 25 వార్డుల్లో 13 ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కుప్పంలో ఎన్నికలు సజావుగా జరగకుంటే చలో కుప్పంకు పిలుపునిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడానికి టీడీపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయానికి వెళితే దాడులు చేశారని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కుప్పంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారని పేర్కొన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వైసీపీపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ గుండాల అరాచకాలకు కుప్పం ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో అడ్డుకట్ట వేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story