గ్రేటర్‌లో గుబులు పుట్టిస్తున్న పోలింగ్.. ఎందుకు ?

by Shyam |
గ్రేటర్‌లో గుబులు పుట్టిస్తున్న పోలింగ్.. ఎందుకు ?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్.. పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. ఓటు ఉన్నవారు ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఎంత ప్రచారం చేసినా బూడిదలో పోసిన పన్నీరులాగానే తయారైంది. జీహెచ్ఎంసీ ప్రజలు బద్ధకంగా వ్యవహిరిస్తూ పోలింగ్‌ స్టేషన్ల దారి పట్టకపోవడంతో పోలింగ్ శాతం పెరగక నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. తొలి 4గంటల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. అసలు గత ఎన్నికల్లో ఓటింగ్ శాతంలో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఓటు వేసిన ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత రిక్వెస్ట్ చేసినా ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. దీంతో పడిపోతున్న పోలింగ్‌ శాతం ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అవుతుందని భయపడుతున్న నేతలు ఓట్లు వేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అంతో ఇంతో చదువుకొని పట్నంలో నివసిస్తున్న జనాలు ఉదయం 11గంటలయినా ఇంట్లో నుంచి అనుకున్నంత రేంజ్‌లో బయటకు రాలేదు. చలికాలం అయినప్పటికీ ఈరోజు ఉదయం నుంచే కాస్త ఎండ వచ్చింది. అయినా జనాలు ఓటింగ్ పట్ల బాధ్యత చూపట్లేదని అర్థమవుతోంది. మాములుగా అయితే ఓటర్లు ఆసక్తి చూపితే తొలి నాలుగు గంటల్లో 15 నుంచి 16శాతం వరకు పోలింగ్ నమోదు అయితే మంచి రెస్పాన్స్ వచ్చినట్లు భావించేది. కానీ ఇవాళ ఉదయం 11గంటలకు వరకు 9శాతమే పోలింగ్ నమోదు కావడంతో ఇది ఏపార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్న చర్చ నడుస్తోంది.

ఏ ఎన్నికల్లో అయినా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి వ్యతిరేకంగా నమోదు అయ్యిందని భావిస్తారు. కానీ ప్రస్తుత పోలింగ్ పెరగకుండా, తగ్గకుండా మందకొడిగా సాగుతుండటంతో రూ.కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థులు తలలు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. ఓటు వేసేందుకు ఇంకా ఐదు గంటల సమయం ఉందని చెబుతూ ఆయా డివిజన్లలో నేతలు, ప్రముఖులు.. ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓటు వేస్తేనే అభివద్ధిపై ప్రశ్నించే హక్కు ఉంటుందని ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని సెల్పీ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట దాటినా 20శాతంలోపే పోలింగ్ శాతం నమోదు కావడంతో ఇప్పటికైనా జనాలు ఓటింగ్‌కు మొగ్గు చూపుతారా లేకుంటే.. ప్రభుత్వ హాలిడే కదా అని ఇళ్లలోనే టైం పాస్ చేస్తారా అన్నది అర్థం కాకుండా ఉంది.

Advertisement

Next Story